గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘లుంగీవాలా’ అంటూ బిజెపి ఎంపి అహంకార వ్యాఖ్యలు

18 గంటల క్రితం

BJP MP’s ‘Lungiwala’ remarks – John Brittas objects
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 12:23 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • దక్షిణాది ప్రజలను అవమానించారని ప్రతిపక్ష ఎంపిలు నిరసన

  • ఎంపి సుష్మితా దేవ్‌ను సమర్ధించిన నడ్డా, రిజిజు

  • ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా లుంగీలతో సభకు హాజరైన ప్రతిపక్ష ఎంపిలు

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటులో దక్షిణాది ప్రజలందరినీ అవమానించిన బిజెపి ఎంపి సుష్మితా దేవ్‌కు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పూర్తి మద్దతు ప్రకటించాయి. చర్చలో పాల్గొంటూ, మాట్లాడుతూ సిపిఎం రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్‌ను 'లుంగీవాలా... లుంగీవాలా' అంటూ పదేపదే అవమానించిన సుష్మితా దేవ్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ నాయకుడు జెపి నడ్డా మద్దతుగా నిలిచారు. బుధవారం, సభాపతి అనుమతితో జాన్ బ్రిట్టాస్ సభలో సుష్మితా దేవ్ చేసిన అవమానకర వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘నేను ఒక దక్షిణాది భారతీయుడిగా, ఒక మలయాళీగా చాలా గర్వపడుతున్నాను. మలయాళ భాష, సంస్కృతి, వస్త్రధారణ, ఆహారం మొదలైన వాటి పట్ల కూడా నేను గర్వపడుతున్నాను. పార్లమెంట్ సభ్యురాలిగా చర్చలో పాల్గొంటూ, మాట్లాడుతూ అధికార పార్టీ ఎంపి, మరో పార్టీ ఎంపిని 'లుంగీవాలా' అని అవమానించారు. సభలో వాగ్వాదాలు సహజం. కానీ ఇక్కడ, జనాభాలోని ఒక వర్గాన్ని అవమానించడానికి లుంగీని ఒక ఆయుధంగా ఉపయోగించారు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు జాన్ బ్రిట్టాస్‌కు మద్దతు ఇవ్వడంతో, అధికార పార్టీ అనవసరంగా గందరగోళం సృష్టించి సుష్మితను సమర్థించేందుకు ప్రయత్నించింది. దీంతో సభాపతి సి.పి. రాధాకృష్ణన్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. 'సభ్యుల సాంస్కృతిక విలువలను అవమానించే వ్యాఖ్యలు చేయకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు సభ్యులను సభకు పిలిచి ఈ విషయంపై చర్చిస్తాం' అని ఆయన అన్నారు. దీని తర్వాత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ సుష్మిత వాదన కూడా వినాలని వాదించారు. 'బ్రిట్టాస్ చెప్పింది రికార్డులో ఉంది. అయితే, సుష్మిత వాదన కూడా వింటేనే ఇరుపక్షాలకు న్యాయం జరుగుతుంది' అని రిజిజు డిమాండ్ చేశారు. రాజ్యసభ నాయకుడు జె.పి నడ్డా మాట్లాడుతూ, మనం లుంగీని ధోతీ అని పిలుస్తామని, అన్ని రకాల దుస్తుల పట్ల మనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. సుష్మిత వాదన కూడా వినాలని ఆయన కోరారు.

రిజిజు, నడ్డా మాట్లాడుతుండగా, బిజెపి మహిళా సభ్యులు వారి వెనుక వరుసగా నిలబడి జాన్ బ్రిట్టాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానాయాగీ చేశారు. భారీ గందరగోళం అనంతరం సభ వాయిదా పడిన తర్వాత, సుష్మితా దేవ్‌కు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు. తాను ఎలాంటి దూషణాత్మక వ్యాఖ్యలు చేయలేదని, అనవసరమైన అపార్థాలను సృష్టించే ప్రయత్నమంటూ ఆమె చెప్పుకొచ్చారు. సుష్మితా దేవ్ అవమానానికి నిరసనగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేతో సహా పలువురు సభ్యులు లుంగీ ధరించి పార్లమెంటులోకి ప్రవేశించారు. పార్లమెంటు బయట కూడా ప్రతిపక్ష సభ్యులు 'లుంగీవాలా' అనే అవమానానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేరళతో సహా దక్షిణ భారత రాష్ట్రాల పట్ల సంఘ్ పరివార్, బిజెపిలకు ఉన్న తీవ్ర ద్వేషానికి బిజెపి ఎంపి చేసిన దూషణాత్మక వ్యాఖ్యలు తాజా ఉదాహరణ అని ఎంపిలు విమర్శించారు.

​పార్లమెంట్ ఆవరణంలో ఆందోళన

బిజెపి ఎంపి సుష్మితా దేవ్ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపిలు నిరసన తెలిపారు. సిపిఎం రాజ్యసభ ఎంపి జాన్ బ్రిట్టాస్‌ను ఉద్దేశించి ‘లుంగీవాలా’ అంటూ అవమానించారని, దక్షిణ భారతీయులందరినీ అవమానించడానికే బిజెపి ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడిందని వారు విమర్శించారు. ఈ నిరసనలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపిలు పాల్గొన్నారు. అయితే, సుష్మితా దేవ్ ఈ అంశానికి మతపరమైన రంగు పులిమి, జాన్ బ్రిట్టాస్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజెపి సభ్యుడు సుకేందు శేఖర్ రాయ్‌తో సహా పలువురు నాయకులు, ఈ విషయంలో సుష్మితదే తప్పు అని నాయకత్వానికి రహస్యంగా తెలియజేశారు. జాన్ బ్రిట్టాస్ సుష్మితకు జారీ చేసిన ఉల్లంఘన నోటీసుపై చైర్మన్ చర్యలు తీసుకున్నారు. నోటీసులో బ్రిట్టాస్‌కు మాట్లాడే అవకాశం కల్పించారు. ఏ సభ్యుడు కూడా తన సహచరుల సాంస్కృతిక లక్షణాలను అవమానించే విధంగా జోక్యం చేసుకోకూడదని కూడా ఆదేశించారు. మరోవైపు యుపిఐ లావాదేవీలపై అదనపు రేట్లు విధించడానికి వీలు కల్పించే సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాన్ బ్రిట్టాస్ సోమవారం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్