శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసుల అనుమతి లేకున్నా.. నిరసన చేపట్టి తీరతాం : అభిజీత్‌ దీప్కే

1 గంట క్రితం

Dipke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 04:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసుల అనుమతి లేకపోయినప్పటికీ.. అక్టోబర్‌ 10న జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతామని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సిజెపి) కార్యకర్త అభిజీత్ దిప్కే శుక్రవారం మరోసారి స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి ఉన్నా లేకున్నా నిరసన కొనసాగుతుందని, అరెస్టులను ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని శుక్రవారం ఆయన పేర్కొన్నారు. నిరసన నేపథ్యంలో ఢిల్లీలో విధించిన ఆంక్ష‍లపై ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఈ భయం దేనికని ప్రశ్నించారు. దేశంలోని యువతను చూసి మీరు ఎందుకు ఇంతగా భయపడుతున్నారని ప్రశ్నించారు. రైళ్లు, మెట్రో సేవలను నిలిపివేస్తున్నారని, ప్రజలు ఏంచేయాలని ప్రశ్నించారు. ప్రజా రవాణా, రోడ్లపై విధించిన ఆంక్షలు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తాయని అన్నారు. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యం గురించి కూడా ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ప్రధాని మోడీ లేదా అమిత్‌షాల ఆస్తా, లేక వారి పూర్వీకుల ఆస్తా, లేక వారి తండ్రి ఆస్తా అని కేంద్రాన్ని నిలదీశారు. ఒకవైపు నిరసన వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని కేంద్రం చెబుతోందని, మరోవైపపు మెట్రో, రైల్వే సేవలను నిలిపివేసి, రోడ్లన్నింటినీ మూసివేస్తోందని అన్నారు. రైల్వే సేవలను నిలిపివేసి, రోడ్లపై ఆంక్ష‍లు విధిస్తే ప్రజలకు ఇబ్బంది కలగదా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, అమిత్‌షాలు తరుచూ బిపి చెక్‌ చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. నిరసన చేపట్టితీరతామని, నిర్బంధానికైనా లేదా అరెస్టుకైనా తాము సిద్ధంగా ఉన్నామని అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. ఎంతమందిని నిర్బంధిస్తారని కేంద్రానికి సవాలు విసిరారు. తాను, సౌరవ్‌, అశుతోష్ సహా కార్యకర్తలంతా అరెస్టులకు సిద్ధమేనని అన్నారు. పోలీసు అనుమతి అవసరమా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. జంతర్ మంతర్ అనేది నిరసనల కోసం కేటాయించిన ప్రదేశమని గుర్తుచేశారు. 13 కోట్ల మంది ఓట్లను తొలగించే ముందు జ్ఞానేష్ కుమార్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. 'ఫారం 6' సవరణను సుప్రీంకోర్టు కూడా ఆమోదించలేదని, దీంతో జ్ఞానేష్ కుమార్ ఎవరికీ చెప్పకుండా, ఎవరినీ అడగకుండా 13 కోట్ల మంది ఓట్లను తొలగించారని మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం మనకు ఉన్న హక్కును వినియోగించుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదని అన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనల కోసం కనీసం 10 రోజుల ముందే దరఖాస్తులు సమర్పించాలన్న ఢిల్లీ పోలీసుల ప్రకటనను, ఆ నిబంధనలను ఈ నిరసనతో ముడిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్