తాడేపల్లి : గ్రేటర్ విశాఖపట్నం నేతలతో వైసిపి అధినేత వైఎస్ జగన్ బుధవారం సమావేశమయ్యారు. దీనిలో పార్టీ సీనియర్ నేతలు బొత్స, కేకే రాజు, గుడివాడ అమర్నాధ్, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, స్థానిక సమస్యలు సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ... విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చిందని, ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా విశాఖలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు ఇచ్చే పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖలో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. పోలవరం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉంటే విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వగలమన్నారు. ఒకవైపు పోలవరంలో ఎత్తు తగ్గించి, 75 టీఎంసీల వరకు అదనపు నిల్వ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మరోవైపు విశాఖలో మూడు రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారని జగన్ పేర్కొన్నారు. విశాఖ భూముల విషయమై మాట్లాడుతూ రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ, విశాఖపట్నంలో మాత్రం 99 పైసలకు చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్లకు భూములు ఇస్తున్నారని ఆరోపించారు. రూ.5వేల కోట్ల విలువైన భూములను గీతం పేరుతో కబ్జా చేస్తున్నారని తెలిపారు. విశాఖలో అత్యంత విలువైన భూములను తమకు నచ్చినవారికి ఇచ్చేసే స్థాయికి ఈ ప్రభుత్వం వెళ్లిపోయిందన్నారు. విశాఖ అభివృద్ది గురించి జగన్ మాట్లాడుతూ ... తమ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో లక్షా 30 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు మంజూరు చేశామన్నారు. కేజీహెచ్‌ను అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మూలపేట పోర్టు వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి పునాదులు వేశామన్నారు. గూగుల్, అదానీ డేటా సెంటర్ వరకు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వచ్చేలా ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసినా తమ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కనిపించిందన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను తీసుకొచ్చామన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్‌ను తీసుకొచ్చామన్నారు. రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేసి ఉద్దానం వరకు నీళ్లు తీసుకొచ్చామని, ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు–నేడు పనులతో ఉత్తరాంధ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లామని వివరించారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో గంజాయితో పాటు మద్యం అందుబాటులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిని అరెస్టులు చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాన్ని నడుపుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. విశాఖ తాగు నీటి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విశాఖ భూముల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ అన్నారు. గంజాయి, మద్యం సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాజకీయ వేధింపులు, అక్రమ కేసులు, పోలీసుల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసిపి నేతలకు జగన్ పిలుపునిచ్చారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే విశాఖలో తాగునీటి సమస్య : వైఎస్.జగన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 03:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)