సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం నుంచి రూ.లక్ష కోట్లు రాబట్టాలి
పంట నష్టపరిహారం ఎకరాకు రూ.40 వేలు, పంటలు వేయని రైతులకు రూ.15 వేలు ఇవ్వాలి
ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కరువును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.లక్ష కోట్ల ప్రత్యేక సహాయాన్ని రాష్ట్రానికి రాబట్టాలని కోరారు. కరువు పరిస్థితులను మండలం, గ్రామం యూనిట్‌గా నిర్ధిష్టంగా పరిశీలించి అవసరమైన నిధులు కేటాయించాలని చెప్పారు. గురువారం విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులు,కౌలు రైతులు,వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16నుండి 24వరకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, మూలం రమేష్, కె.ప్రభాకరరెడ్డి, వి.రాంభూపాల్,రాష్ట్ర నాయకులు వి.క్రిష్ణయ్య, దడాల సుబ్బారావు, ఎం.హరిబాబు, కె.ఆంజనేయులు, వి.వెంకటేశ్వర్లు, ఎం.సూర్యనారాయణ,వి.శివనాగరాణి తదితర నాయకులు మూడు బృందాలుగా రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం, పల్నాడు, కృష్ణా, ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, ఎఎసఆర్ తదితర 12 జిల్లాలలో 60కి పైగా మండలాలు, 200 గ్రామాలలో ప్రత్యక్షంగా కరువు పరిస్థితులను సిపిఎం రాష్ట్ర బృందం పరిశీలించినట్లు తెలిపారు. రైతులు,కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు,గ్రామీణ పేదలు కరువు కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.
గడచిన 30 ఏళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని రైతులు తమతో చెప్పారన్నారు. అనేక గ్రామాల్లో వేల ఎకరాల భూములు ఉన్నప్పటికీ ఒక్క ఎకరంలో కూడా పంట వేయలేని పరిస్థితి ఉందని, ఎప్పుడూ ఎండిపోని చెరువులు సైతం ఎండిపోయాయని తెలిపారు. మనుషులకే కాకుండా పశువులు, గొర్రెలు, మేకలకు కూడా తాగునీరు, మేత కొరత తీవ్రంగా ఉందన్నారు.
పంటలు వేసిన రైతులూ తీవ్రంగా నష్టపోయారు
ప్రభుత్వం సాగునీరు అందిస్తామని ఇచ్చిన భరోసాతో కృష్ణా డెల్టాతోపాటు వివిధ ప్రాంతాల్లో రైతులు వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, ఉల్లి, ఆముదం, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారని, వర్షాలు లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయని తెలిపారు. పంటలను కాపాడుకునేందుకు అనేక ప్రాంతాల్లో రైతులు ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని తోడుతూ అదనపు ఖర్చులు భరిస్తున్నారని చెప్పారు. ఆయిల్ ఇంజన్లకు సబ్సిడీపై డీజిల్, పెట్రోల్ అందించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టినా దిగుబడి తీవ్రంగా పడిపోయిందని తెలిపారు. ఉల్లి సాగులో కూడా రైతులు భారీగా నష్టపోయారని చెప్పారు. కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో సుమారు 1,600 ఎకరాల్లో ఉల్లి సాగు చేసినా దిగుబడి రాకపోవడంతో ఒక్కో రైతు రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి నష్టపోయినట్లు రైతులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు.
నంద్యాల జిల్లాలో తెలుగు గంగ, కెసి కెనాల్, ఎస్‌ఆర్‌బిసి వంటి సాగునీటి వనరులు ఉన్నప్పటికీ నీరు అందక విస్తారమైన ప్రాంతంలో వరి సాగు చేయలేకపోయారని చెప్పారు. బోర్లు, మెట్ట భూములపై ఆధారపడి సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, ఆముదం తదితర పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. కౌలు రైతులు ముందుగానే కౌలు చెల్లించడంతోపాటు పంట పెట్టుబడులు పెట్టినా ఆదాయం రాక అప్పుల భారంలో కూరుకుపోయారని చెప్పారు.
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల కింద సాగు చేసిన చీని, బత్తాయి, నారింజ, దానిమ్మ వంటి ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. పదేళ్లకు పైగా పెంచిన తోటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పారు. హంద్రీ-నీవా కాలువల ద్వారా చెరువులను నింపి భూగర్భ జలాలను పెంచాలని రైతులు కోరుతున్నారని తెలిపారు.
కృష్ణా డెల్టాలోనూ సాగునీటి కొరత
కృష్ణా జిల్లా అవనిగడ్డ డివిజన్‌లోని కోడూరు, నాగాయలంక తదితర మండలాల్లో సాగునీటి కొరత తీవ్రంగా ఉందని శ్రీనివాసరావు తెలిపారు. అనేక గ్రామాల్లో వరి నాట్లు పడలేదని, కొన్ని చోట్ల కాలువలు, వాగుల్లో ఉన్న నీటితో ఆయిల్ ఇంజన్ల ద్వారా పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఒక్కో తడికి రైతులు భారీగా అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.
కోడూరు మండలం సాలెంపాలెం గ్రామంలో నాలుగు చెరువులు ఉన్నప్పటికీ ఒక్క చెరువులోనూ నీరు లేదని, తాగునీరు, పశువుల నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. వేణుగోపాలపురం, పాలకాయతిప్ప, హంసలదీవి, రామకృష్ణాపురం తదితర గ్రామాల్లో సాగునీరు, తాగునీరు, ఉపాధి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉపాధి లేక అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నాయని తెలిపారు.
ప్రకాశం, బాపట్ల, పల్నాడులోనూ తీవ్ర పరిస్థితులు
ప్రకాశం జిల్లాలో ఖరీఫ్‌లో సాగు కావాల్సిన విస్తీర్ణంతో పోలిస్తే చాలా తక్కువ భూమిలోనే సాగు జరిగిందని తెలిపారు. కంది, జూట్, మిర్చి, కూరగాయలు తదితర పంటలు వర్షాభావంతో దెబ్బతిన్నాయని చెప్పారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. పంటలకు మద్దతు ధర లేకపోవడం కూడా రైతుల నష్టాలను మరింత పెంచిందన్నారు.
బాపట్ల జిల్లాలోని అనేక మండలాల్లో సాగునీటి కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. కృష్ణా డెల్టాకు నీరు అందుతుందనే ప్రభుత్వ హామీతో రైతులు పంటలు వేసినా ప్రస్తుతం అవి ఎండిపోతున్నాయని చెప్పారు. ఆయిల్ ఇంజన్లతో పంటలను కాపాడుకోవడానికి అదనపు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
పల్నాడు జిల్లాలో అనేక మండలాల్లో వేల ఎకరాల్లో పంటలు వేయలేని పరిస్థితి ఉందని, అక్కడక్కడా వేసిన పత్తి పంటకు కూడా ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. కౌలు రైతులు సాగు కౌలు, పెట్టుబడి రెండింటినీ భరించి తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
ఉత్తరాంధ్రలోనూ కరువు ప్రభావం
అనకాపల్లి జిల్లాలో పంటలు వేసిన రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక నష్టపోతున్నారని తెలిపారు. సాగునీరు అందుతుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ అనేక ప్రాంతాల్లో పొలాలకు నీరు చేరడం లేదని రైతులు తమతో చెప్పారని పేర్కొన్నారు. పాడి రైతులు కూడా పశువుల మేత ఖర్చులు పెరగడంతోపాటు పాల దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరి సాగు తీవ్రంగా దెబ్బతిన్నదని, కాఫీ, మిరియాల పంటలపై కూడా కరువు ప్రభావం పడిందని చెప్పారు. అనేక మండలాల్లో గత నాలుగు, ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని రైతులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. కాఫీ సాగు చేస్తున్న గిరిజన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారని చెప్పారు.
ఉపాధి లేక గ్రామీణ పేదల వలసలు
కరువు కారణంగా వ్యవసాయ పనులు లేకపోవడంతో గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పనులు కూడా సక్రమంగా అందడం లేదని శ్రీనివాసరావు అన్నారు. పని కోరిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాల్సి ఉన్నప్పటికీ అనేక గ్రామాల్లో ఆ స్థాయిలో పనులు లేవని తెలిపారు. ఉపాధి లేక కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామం నుంచి సుమారు 100 మంది వలస వెళ్లి ఇతర ప్రాంతాల్లో రైల్వే పనులు చేస్తున్నారని చెప్పారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి పని కోరిన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలని, రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా అమలు చేయాలని, ఉపాధి హామీ పథకంలో అవినీతిని అరికట్టాలని కోరారు.
తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి
కరువు ప్రభావిత రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పాడి రైతులు, వృత్తిదారులు, గ్రామీణ పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
పంటలు వేసి నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.40 వేల చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని, పంటలు వేయలేని రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. ఇన్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, అన్ని పంటలకు పంటల బీమా అమలు చేసి బీమా పరిహారాన్ని తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతులు ముందస్తుగా చెల్లించిన కౌలు మొత్తాన్ని తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని, రైతులు, కౌలు రైతులు, పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేయాలని కోరారు. రబీ సాగు కోసం మినుములు, పెసలు, శనగ, కొర్ర, జొన్న తదితర విత్తనాలను 100 శాతం సబ్సిడీపై అందించాలని, అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందేలా ఎరువుల యాప్‌ను మార్చాలని లేదా రద్దు చేయాలని కోరారు. భూమిలేని పేదలు, పేద రైతులు, కౌలు రైతులకు సంవత్సరం పాటు చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను కరువు భత్యంగా అందించాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, పశువులు, గొర్రెలు, మేకలకు మేత, దాణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. ఆయిల్ ఇంజన్ల ద్వారా పంటలను కాపాడుకుంటున్న రైతులకు సబ్సిడీపై డీజిల్, పెట్రోల్ అందించాలని అన్నారు.
కరువు కారణంగా ఉపాధి కోల్పోయిన గ్రామీణ పేదలకు ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టి వలసలను నివారించాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలను ప్రకటించి సమగ్ర సహాయక ప్యాకేజీ అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)