ఎపి జెఎసి అమరావతి నూతన రాష్ట్ర కమిటీ ఎంపిక
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, సాధికారతే లక్ష్యంగా ఎపి జెఎసి అమరావతి మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎపి జెఎసి అమరావతి ప్రకటించింది. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మహిళా విభాగం సదస్సులో ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మహిళా విభాగం ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా 21 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎంపిక చేశామని తెలిపారు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎపి జెఎసి అమరావతి అండగా నిలుస్తుందన్నారు. సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ.. ఎపి జెఎసి అమరావతి చేపట్టిన ఉద్యమాల్లో మహిళా ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అసోసియేట్ ఛైర్మన్ టివి ఫణి పేర్రాజు మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించి, భవిష్యత్తులో నిర్ణయాత్మక ప్రక్రియల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఇప్పటికే కమిటీలు బలంగా పనిచేస్తున్నాయని, రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
నూతన రాష్ట్ర మహిళా కమిటీ ఛైర్‌పర్సన్‌గా పొన్నూరు విజయలక్ష్మి, సెక్రటరీ జనరల్‌గా పి రజిని, అసోసియేట్ ఛైర్‌పర్సన్‌గా సైకం శివకుమార్‌రెడ్డి, కోశాధికారిగా విఎస్ సాయిలక్ష్మి, పబ్లిసిటీ సెక్రటరీగా జి అనుపమ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనుషాలత వీరితోపాటు ఐదుగురు కో-ఛైర్‌పర్సన్లు, ఐదుగురు వైస్ ఛైర్‌పర్సన్లు, ఐదుగురు సెక్రటరీలను ఎంపిక చేశారు.
రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ సాధనకు కృషి
మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్‌ను ఉద్యోగ విరమణలోపు వినియోగించుకునే అవకాశం కల్పించేలా ఉత్తర్వులు సాధించడంలో మహిళా విభాగం కృషి చేసిందని నూతన ఛైర్‌పర్సన్ పొన్నూరు విజయలక్ష్మి, సెక్రటరీ జనరల్ పి రజిని తెలిపారు. మహిళా ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, కార్యాలయాల్లో కనీస సదుపాయాల కల్పనకు సంబంధించి సదస్సు సమాన ప్రాతినిధ్యం, రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్, ప్రత్యేక టాయిలెట్లు, శిశు సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన నాలుగు తీర్మానాలను ఆమోదించింది.







కామెంట్‌లు (0)