ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎంబిబిఎస్‌ ప్రవేశాల గడువు పొడిగింపు పరిశీలిస్తాం..

1 గంట క్రితం

mbbs.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 09:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాష్ట్రానికి కేంద్రం హామీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రస్తుత విద్యా సంవత్సరం (2026–27) ఎంబిబిఎస్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, నీట్‌ యుజి అర్హత శాతం తగ్గింపు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తామని జాతీయ వైద్య ‌కమిషన్‌ (ఎన్‌ఎంసి) వెల్లడించింది. స్ట్రే రౌండ్‌ కౌన్సెలింగ్‌ అనంతరం ఎన్‌ఆర్‌ఐ కోటాలో 112 ఎంబిబిఎస్‌ సీట్లు ఖాళీగా మిగలడంతో ప్రవేశాల గడువును మరో 15 రోజులు పొడిగించాలని డాక్టర్‌ ఎన్‌‌టిఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రభుత్వ సూచనల మేరకు ఎన్‌ఎంసిని కోరింది. ఈ అంశంపై విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఎన్‌ఎంసి ఛైర్‌పర్సన్‌‌తో పాటు కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయంలోని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (వైద్య విద్య)కు లేఖ రాశారు. ఈ విద్యా సంవత్సరం ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 26లోగా పూర్తి చేయాల్సి ఉంది. విశ్వవిద్యాలయం మొదటి, రెండో, మూడో విడత (మాప్‌-అప్‌) కౌన్సెలింగ్‌తో పాటు స్ట్రే రౌండ్‌ కౌన్సెలింగ్‌ను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించింది. ఈ నెల 23న స్ట్రే రౌండ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయినా 112 ఎంబిబిఎస్‌ సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ సీట్లను భర్తీ చేసేందుకు నీట్‌ యుజి–2026 అర్హత శాతాన్ని తగ్గించాలని, కౌన్సెలింగ్‌, ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు చివరి తేదీని మరో 15 రోజులు పొడిగించాలని విశ్వవిద్యాలయం విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి కూడా ఎంబిబిఎస్‌ ప్రవేశాల గడువును నవంబరు 20, 2026 వరకు పొడిగించాలని కోరిన విషయాన్ని విశ్వవిద్యాలయం తన లేఖలో ప్రస్తావించింది. అలాగే పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 9, పద్మావతి మెడికల్ కళాశాలలో 8 చొప్పున ఎన్‌ఆర్‌ఐ సీట్లు మిగిలాయి. ఇదే కేటగిరిలో మిగిలిన 95 సీట్లు ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్