సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
సిపిఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం
ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్/కార్పొరేషన్ : కర్నూలు నగరంలో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిపిఎం అభ్యర్థులను కార్పొరేషన్‌కు పంపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజలను కోరారు. నగరంలోని పలు వార్డుల్లో ఆదివారం మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మేయర్ అభ్యర్థి బి శ్యామలకు, జొహారాపురంలోని 22, 23 వార్డుల్లో సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థులు ఎం నాగమ్మ, ఎం రామాంజనేయులు (విజయ్), 59వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి ఎం కుమారి, 49వ వార్డు పర్యటనలో కార్పొరేటర్ అభ్యర్థి ఎన్ అలివేలు, 42వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి జి ధనలక్ష్మికి మద్దతుగా శ్రీనివాసరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. సిపిఎం మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. కర్నూలు సుందరయ్య భవన్‌లో సుందరయ్య విగ్రహానికి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగుకాలువలు, సిసి రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నగర అభివృద్ధిని గత పాలకులు, ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం పట్టించుకోడంలేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వామపక్ష అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో పేదలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ మేయర్ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపిస్తే సాధ్యమవుతుందన్నారు. అందుకే తమ అభ్యర్థులను కార్పొరేషన్‌కు పంపించాలని, కర్నూలు నగర ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రచారాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిపిఐ సీనియర్ నాయకులు జగన్నాథం, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కెవి నారాయణ, పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు, తదితరులు పాల్గొన్నారు.










కామెంట్‌లు (0)