ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రాణ నష్టం జరగకుండా చర్యలు..

1 గంట క్రితం

Suspension for rebels who stay in the fray: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 08:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యం

  • 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్నబ్ తుపాను నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్ధత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో పని చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యక్షంగా, ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌‌గా ముఖ్యమంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం సాధ్యమైనంత తగ్గించాలని సూచించారు. ప్రజల ఫోన్లకు నిరంతరం సమాచారమిచ్చి అప్రమత్తం చేయాలన్నారు. విద్యుత్‌శాఖ పూర్తి సన్నద్ధతతో ఉండి విద్యుత్ పునరుద్ధరణ వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లు తీరానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలతో వచ్చే వరదతో నీటి వనరులను నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జలవనరులశాఖ అధికారులకు సూచించారు. జీరో ఇన్సిడెంట్స్ లక్ష్యంగా అన్ని స్థాయిల్లో ప్రభుత్వ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వసతులు, సౌకర్యాలు ఉండాలన్నారు. సివిల్ సప్లై, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, హోం, ఫైర్, వ్యవసాయశాఖ అధికారులు తుపాను సన్నద్ధత చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డిజిపి హరీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

వదంతులు నమ్మొద్దు : హోంమంత్రి అనిత

తుపాను ప్రభావం దృష్ట్యా రైతులు, ప్రజలు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కోరారు. సోషల్‌ మీడియాలో ప్రచారమయ్యే వదంతులు నమ్మొద్దని, వాటిని ఇతరులకు పంపొద్దని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ జారీ చేసే అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్