పీచుమామిడి గ్రామస్తుల ఆందోళన
ప్రజాశక్తి - అనంతగిరి (అల్లూరి జిల్లా) : భారీ పేలుడు ధాటికి ఇళ్లు దెబ్బతినడం, గోడలకు బీటలు వారడంతో ఎప్పుడు కూలిపోతాయోనన్న భయంతో అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పీచుమామిడి గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శనివారం జరిగిన పేలుడు ఘటనలో ఏడుగురు మృతిచెందగా, తమ గ్రామంలోని 12 ఇళ్లు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, రోడ్డు పనుల కాంట్రాక్టర్ తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆధార్ కార్డులు చేతబట్టి వారు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కొర్రా జమ్ములు, కొర్రా జ్యోతి మాట్లాడుతూ పినకొండ పంచాయతీ బలగరువు నుండి పీచుమామిడి మీదుగా దాయర్తి, మడ్రేబు, తునిసిబు గ్రామాల వరకు బిటి రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నాయని, అందుకు సంబంధించి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి నుంచి వాహనంలో డీజిల్‌ను డ్రమ్ముల్లో తెచ్చి మరో వాహనంలోకి మార్చుతున్న క్రమంలో అక్కడే ఉన్న పేలుడు పదార్థాలు, గ్యాస్ సిలిండర్‌పై పడి ఒక్కసారిగా పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని, ఆ సమయంలో తమ గ్రామస్తులంతా వ్యవసాయ పనులకు వెళ్లడంతో చాలా మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అన్నారు. మృతుల కుటుంబాలకు, దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందించాలని, ఘటనకు కారకుడైన రోడ్డు కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి : సిపిఎం మాజీ జెడ్‌పిటిసి గంగరాజు
పేలుడు ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం మాజీ జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు అన్నారు. ఘటనా స్థలాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీజిల్ రవాణా చేసే వాహనంలో పేలుడు పదార్థాలతోపాటు గ్యాస్ సిలిండర్ రవాణా చేయడంతోనే ఇంత పెద్ద ప్రమాదం వాటిల్లిందని, ఇది ముమ్మాటికీ కాంట్రాక్టరు నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)