ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి

1 గంట క్రితం

ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి
-  యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) డిస్కం మహాసభ డిమాండ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 09:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) డిస్కం మహాసభ డిమాండ్

ప్రజాశక్తి - తిరుపతి సిటి : విద్యుత్ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) డిస్కం 8వ మహాసభ తీర్మానించింది. తిరుపతి యశోదానగర్‌ వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన మహాసభకు విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, తొమ్మిది జిల్లాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహాసభను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అఖిల భారత కోశాధికారి ఎస్.రాజేంద్రన్ ప్రారంభించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపిస్తూ ప్రజలకు, కార్మికులకు నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు వాటిని ధ్వంసం చేస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలకు భారీ రుణాలు, రాయితీలు కల్పిస్తున్నాయన్నారు. విద్యుత్ అందరికీ అవసరమైన సేవ అని, దానిని లాభాపేక్షతో పనిచేసే ప్రైవేటు సంస్థల చేతుల్లోకి నెట్టడం వల్ల విద్యుత్ రంగం క్రమంగా ప్రైవేటు యజమానుల నియంత్రణలోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాల్లో ప్రైవేటు విద్యుత్ సంస్థల అనుభవాలు ఉన్నప్పటికీ, ఎపి ట్రాన్స్‌కో లైన్లపై ప్రైవేటు విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, నాలుగు లేబర్ కోడ్‌లతో కార్మిక హక్కులకు నష్టం కలుగుతోందని వివరించారు. విద్యుత్ రంగ పరిరక్షణ కోసం డిసెంబర్ 1న జరిగే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో షిరిడీ సంస్థకు రూ.1,800 కోట్లు, టిడిపి కూటమి హయాంలో రూ.వెయ్యి కోట్లు చెల్లించారని విమర్శించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమైక్యంగా పోరాడాలని కోరారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుగ్గిరాల సూరిబాబు, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలో యూనియన్ నిర్వహిస్తున్న పోరాటాలను వివరించారు. మహాసభకు యూనియన్ డిస్కం అధ్యక్షులు ఎన్.శివశంకర్ అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జాకీర్ హుస్సేన్ నివేదిక సమర్పించారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్, నాయబ్ రసూల్, పెంచల ప్రసాద్, నాదముని రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక

మహాసభ ముగింపులో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నాయబ్ రసూల్ (కడప), ప్రధాన కార్యదర్శిగా పెంచల ప్రసాద్ (నెల్లూరు), కోశాధికారిగా ఎన్.నాదముని రెడ్డి ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా కందారపు మురళి, చీఫ్ అడ్వైజర్‌గా ఎస్.కె.జాకీర్ హుస్సేన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్.శివశంకర్ ఎన్నికయ్యారు. వీరితో పాటు తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, తొమ్మిది మంది సహాయ కార్యదర్శులు, నలుగురు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 35 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు నూతన ప్రధాన కార్యదర్శి పెంచల ప్రసాద్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్