ప్రమాదం చెప్పి రాదు, జాగ్రత్తే రక్షణ: విద్యుత్ శాఖ
ప్రజాశక్తి - తెనాలిరూరల్ : అర్ణబ్ తూఫాను కారణంగా వీస్తున్న ఈదురుగాలుల నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. వర్షం సమయంలో విద్యుత్ పరికరాలు, స్తంభాలు, తీగల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
విద్యుత్ శాఖ సూచనలు ఇవీ..
తడిసిన విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు.
తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు, స్విచ్‌బోర్డులను ముట్టుకోరాదు.
విద్యుత్ లైన్లకు ఆనుకుని ఉన్న చెట్లు, కొమ్మలను తాకరాదు. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలినట్లయితే వాటిని తొలగించే ప్రయత్నం చేయకుండా వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
గాలులు, వర్షాల కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. పార్కులు, స్టేడియంలు తదితర ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలను తాకకుండా జాగ్రత్తపడాలి. ఇంటి బయట ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, పరికరాలు నీటికి తడవకుండా చూసుకోవాలి.
విద్యుత్‌కు సంబంధించిన ఏ పరికరాన్నీ తడి చేతులతో ముట్టుకోరాదు.
చిన్నారులను విద్యుత్ స్తంభాలు, పరికరాలు, తీగల వద్దకు వెళ్లకుండా చూడాలి. ఇళ్లలో ఉతికిన దుస్తులను విద్యుత్ తీగలు లేదా ఇనుప తీగలపై ఆరవేయరాదు. వాటర్ హీటర్ ఉపయోగించే సమయంలో ముందుగా విద్యుత్ స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ తొలగించిన తర్వాతే పరికరాన్ని తాకాలి.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో డిష్ కనెక్షన్‌ను తొలగించడం మంచిది.
వర్షం సమయంలో టివి, కంప్యూటర్, ఫ్రిజ్ వంటి విద్యుత్ పరికరాలను అవసరమైతే స్విచ్ ఆఫ్ చేసి సురక్షితంగా ఉంచాలి.
ఇంటికి వచ్చే సర్వీస్ వైర్ దెబ్బతిన్నా, తెగిపోయినా స్వయంగా మరమ్మతు చేయకుండా విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. విద్యుత్ లైన్‌కు సమీపంలో ఉరుములు, మెరుపులు సంభవిస్తున్నప్పుడు బయట ఉండకుండా సురక్షిత ప్రదేశంలో ఉండాలి.
సమాచారం ఇవ్వండి
ఇంటికి వచ్చే సర్వీస్ వైర్ దెబ్బతిన్నా లేదా విద్యుత్ సంబంధిత సమస్య తలెత్తినా సంబంధిత జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం, లైన్‌మన్, లైన్ ఇన్‌స్పెక్టర్, సబ్‌స్టేషన్ సిబ్బంది, ఏఈలకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. అత్యవసర విద్యుత్ ఫిర్యాదుల కోసం 1912కు ఫోన్ చేయాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదం చెప్పి రాదు.. అప్రమత్తతే ప్రాణ రక్షణ అని ఎపిసిపిడిసిఎల్ తెనాలి డివిజన్ టౌన్ డిఈ బోరుగడ్డ అశోక్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)