స్త్రీ శక్తి పథకం అమలులో లోపాలు సరిదిద్దాలి. నిరసన ర్యాలీ కడప ఆర్టీసీ డిఎం కి వినతి పత్రం
ప్రజాశక్తి - కడప అర్బన్ : ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, స్త్రీ శక్తి పథకంలో లోపాలను సరిదిద్దాలని ఐద్వా (మహిళా సంఘం) రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి డిమాండ్ చేశారు. గురువారం కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడుతూ .. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ కనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సింది పోయి అందుకు విరుద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా 900 బస్సులు తగ్గించడం దుర్మార్గమని తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్త్రీ శక్తి పథకం కారణమైనట్లు ప్రచారం చేయడం అన్యాయమని చెప్పారు. అనేక ప్రాంతాలలో బస్ స్టాప్ లను తగ్గించడం, స్టాప్ వద్ద బస్సులు నిలపకపోవడం చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళా ప్రయాణికుల పట్ల దురుసుగా, అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ స్టాప్ లలో తప్పనిసరిగా బస్సులు నిలపాలని, మహిళా ప్రయాణికులను గౌరవానికి భంగం కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు డ్రైవర్లకు, కండక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బస్టాండ్లలో ఉచిత మరుగుదొడ్లు, మౌలిక సమస్యలు పరిష్కరించాలని, చంటి పిల్లలకు పాలు ఇచ్చే గది ఏర్పాటు చేయాలని తెలిపారు. బస్టాండులలో ప్రధమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తిను బండారాలు, వాటర్ బాటిల్ అధిక రేట్లకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ డిఎం నిరంజన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ డిమాండ్లపై డిఎం సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఐ.ఎన్.సుబ్బమ్మ, ముంతాజ్ బేగం, జిల్లా నాయకురాలు జమీల, కామేశ్వరమ్మ, శంషాద్, విజయలక్ష్మి, వెంకటసుబ్బమ్మ, మేరీ, బేబీ, లక్ష్మీదేవి, అమెజాన్ ల ప్రేమ తో పాటు ఈ ధర్నాకు సంఘీభావంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీదేవి మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎ.రామ్మోహన్ వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులు రెడ్డి, చంద్రారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరి రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు రఘు, జితేంద్ర పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)