ప్రజాశక్తి-రాజోలు: అల్పపీడనం వల్ల ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికి వీఆర్ఏలు తమ నిరసనను మరింత ఉధృతం చేశారు. ఏపీ వీఆర్ఏ జేఏసీ సంఘం పిలుపు మేరకు గత తొమ్మిది రోజులుగా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా సమ్మె కొనసాగిస్తున్నారు. గురువారం ఆలమూరు, రాజోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా గ్రామస్థాయిలో ప్రభుత్వ సేవలను అందిస్తూ విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించడంతో పాటు పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు దారపురెడ్డి వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె. రాజబాబు, జిల్లా కార్యదర్శి ఏ. కాశీ విశ్వేశ్వరరావు, ఆర్. నాగేశ్వరరావు, నాయకులు ఉండవల్లి శ్రీనివాసరావు, పారి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె. రవికుమార్, డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆలమూరులో అర్థనగ్నంగా నిరసన తెలుపుతున్న విఆర్‌ఎలు









కామెంట్‌లు (0)