గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

1 గంట క్రితం

chittur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 03:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పంట నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి

సిపిఎం కరువు బృందం పర్యటనలో రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు డిమాండ్

ప్రజాశక్తి- చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లాలోని పలమనేరు ప్రాంతంలో సిపిఎం రాష్ట్ర కరువు బృందం గురువారం పర్యటించింది. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, జిల్లా నాయకులు ఓబుల్ రాజు, గిరిధర్ గుప్తా పాకాల సుబ్రహ్మణ్యం, శ్రీరాములు, ఆయా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మూడు బృందాలు కరువు పర్యటన చేస్తూ ప్రత్యక్షంగా చూసిన వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి అధ్యయనం చేసి పర్యటిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నామని వివరించారు. పలమనేరు ప్రాంతంలో పెసరగుంట కొత్తచెరువులో నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. ఈ చెరువు ఆయకట్టు పరిధిలో 200 ఎకరాలు రైతులు సాగు చేసుకునే వారిని ఇప్పుడు పూర్తిగా 200 ఎకరాలు బీడుగా మారిన పరిస్థితి ఉందన్నారు. చెరువులో నీరు లేకపోవడంతో బోరు బావుల్లో ఉన్న నీరు కూడా అడుగంటిపోయిందని బోర్లు నమ్ముకుని కొద్దిగా పంటలు వేసిన అవి సరిపడక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామ రైతు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. చెరువులు ఎండిపోవడంతో చెరువులో ఉన్న మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తరలిస్తున్నారని, అధికారులకు తెలియజేసిన ఏమాత్రం చలించడం లేదని తెలిపారు. అలాగే గంగవరం మండలం మరుమాకులపల్లి గ్రామంలో పర్యటించగా బోర్లు నీరు లేక పంటకు చేతికందే సమయంలో టమోటా పంట ఎండిపోయింది అన్నారు. ఎకరాకు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పూర్తిస్థాయిలో నష్టపోయి అప్పుల మిగిలాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేరుశెనగ పంట వర్షాధారపంట వర్షాలు పడతాయని ఆశతో కొంతమంది పంట వేస్తే కొన్నిచోట్ల భూముల్లోనే విత్తనాలు వుండిపోయిన పరిస్థితి‌. కొన్నిచోట్ల చిన్న మొలకలు వచ్చినా ఎండిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపించింది. నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతుంటే వాటికి మాత్రం ఆకు పచ్చగా కనిపిస్తున్నదే తప్ప పూర్తిస్థాయిలో పంట నష్టపోయిన తర్వాత వర్షం పడినా రైతులకు ఉపయోగపడలేదని తెలిపారు. మా పర్యటనలో అనేక అంశాలు కరువు తీవ్రత వచ్చాయని వీటిపై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ .. జిల్లాలో అత్యధిక స్థాయిలో మామిడి రైతులు ఉన్నారని, ఎల్ నినో ప్రభావంతో కరువు విలయతాండవం చేస్తున్నదని, వర్షాలు లేక 30 సంవత్సరాలు సర్వీస్ వున్న మామిడి చెట్లు కూడా ఎండిపోతున్నాయని తెలిపారు. అధికారులు ఇప్పటివరకు జిల్లాలో మండలాల వారీగా ఎంత పంట నష్టం జరిగిందని సమాచారం సేకరించకపోవడం దారుణమన్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి పర్యటన వచ్చిన సందర్భంగా జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం డిమాండ్ చేసిందని, కానీ ముఖ్యమంత్రి కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదని అన్నారు. అక్టోబర్ నెలలో కరువు మండలాలు ప్రకటిస్తామని చెప్పడం సరైనది కాదని వెంటనే చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవడానికి 50 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సమగ్రంగా మండలాల్లో ఏమేమి నష్టం జరిగింది కరువు తీవ్రత ఎలా ఉంది అనేదానిపై నివేదిక ఇవ్వాలని దానాధారంగా ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్