- బిక్కుబిక్కుమంటూ చెట్టుకొకరు పుట్టకొకరు
- ధీనావస్థలో బాధితుల జీవితాలు
- పోలీసు నిర్బంధం, అడ్డంకులపై చర్యలు
- ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి పునరావాసం, పరిహారం కల్పించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, పెళ్లయిన యువతులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, నిర్వాసితులు, ప్రజా ప్రతినిధులపై పోలీసు నిర్బంధం, అడ్డంకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు భూములిచ్చినా నిర్వాసితులకు ఆనందం దక్కలేదని, ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ చెట్టుకొకరు పుట్టకొకరుగా దీనావస్థలో జీవితాలు గడుతుపున్నారని, పైగా పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి ప్రారంభించడంపై సిపిఎం సహా జిల్లా ప్రజలంతా హర్షించారని తెలిపారు. ప్రాజెక్టు కింద నిర్వాసితులకు ఈ ఆనందంలో భాగం దక్కలేదని పేర్కొన్నారు. వారికి ఆర్‌అండ్‌ఆర్, ప్యాకేజీ జీవనోపాధి రక్షణ సమాంతరంగా పూర్తిచేయలేదని పేర్కొన్నారు. తమ భూములు, ఇళ్లు, గ్రామాలను కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, 11 గ్రామాలకు సంబంధించిన నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటికీ అనేక కుటుంబాలకు పూర్తి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పరిహారం అందలేదని సిపిఎం నాయకత్వం పరిశీలనతో వెల్లడైందని వివరించారు. కొన్ని కుటుంబాలకు మాత్రమే ఇంటి స్థలాలు కేటాయించారని, ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. గతంలో గుర్తించిన కుటుంబాలతో పాటు, 2026 ఆగస్టు 31 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను కుటుంబాలుగా పరిగణించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి అర్హులుగా గుర్తించాలని కోరామని, అటువంటి వారికి రెండు లక్షలు ప్రకటించినా 18 సంవత్సరాలు నిండి పెళ్లయిన యువతులకు కూడా సముచిత ప్రయోజనాలు కల్పించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఓటిఎస్ పేరుతో ప్యాకేజి ఇచ్చిన వారికి కూడా ఇంటి స్థలం అవసరమైన సదుపాయాలు పూర్తిగా కల్పించాల్సి ఉందని కోరారు. నిర్వాసితులకున్న చట్టపరమైన హక్కులు ప్రభుత్వానికి తెలుసని, 2013 భూసేకరణ చట్టంలో సెక్షన్ 38 ప్రకారం, భూమిని స్వాధీనం చేసుకునే ముందు పరిహారం, అర్‌అండ్‌ఆర్ హక్కుల అమలుకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయని వివరించారు. పునరావాస ప్రక్రియ అన్ని అంశాలలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ పై ఉందని సెక్షన్ 38(2) పేర్కొంటుందని, సాగునీటి/హైడల్ ప్రాజెక్టులకు సంబంధించి ముంపునకు ఆరు నెలల ముందు పరిహారంతో పాటు అన్ని పూర్తి చేయాలనే ప్రత్యేక నిబంధన కూడా సెక్షన్ 38(1)లో ఉందని తెలిపారు. అయినా ఇదేమీ అమలు చేయలేదని, వారంతా ప్రతిరోజూ అధికారులు చుట్టూ తిండి, నీళ్లు లేకుండా తిరుగుతున్నారని, వారి బాధను తెలిపేందుకు నిరసన తెలియచేయడాన్ని కూడా అనుమతించకుండా నిరంకుశంగా అధికారులు అడ్డుకున్నారని లేఖలో తెలిపారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు ప్రయత్నించిన సందర్భంలో పోలీసులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి.సోమయ్యతో పాటు మరికొందరిని నిర్బంధించారని, సోమయ్యను కక్షగట్టి కొట్టారని అన్నారు. నిర్వాసితుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరించారని, వంటావార్పు కార్యక్రమాన్ని అడ్డుకున్నారని, ఆహారాన్ని పారబోశారని తెలిపారు. పాత్రలను పోలీస్ స్టేషన్‌కు తరలించారన్నారు. నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు ప్రెస్‌క్లబ్‌లో సమావేశం జరుపుకోడాన్ని అడ్డుకుంటూ ప్రెస్ క్లబ్ వారిపై ఒత్తిడి చేశారని వివరించారు. ఈ అక్రమ చర్యలకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు తమ సమస్యలను శాంతియుతంగా వ్యక్తం చేసుకునే ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. స్వయంగా జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ‘ప్రాజెక్టు ప్రయోజనాల కోసం నిర్వాసితుల హక్కులు, గౌరవం, జీవనోపాధి వదులుకున్నారు వారి త్యాగం మరువలేనిదని శిలాఫలకం వేసిన ప్రభుత్వం “ప్రాజెక్టు అభివృద్ధి - నిర్వాసితుల పునరావాసం” రెండూ సమాంతరంగా పూర్తయ్యే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా ఆదేశించాలని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
1. నిర్వాసితుల కాలనీలలో సదుపాయాలు కల్పించాలని, గృహనిర్మాణం చేసుకునేందుకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని, ఇతర మెటీరియల్ హోల్ సేల్ రేట్లకు సరఫరా చేయాలని కోరారు.
2. పెండింగ్‌లో ఉన్న మొత్తం పరిహారం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలని, మిస్సింగ్ జాబితా, గెజిట్లో పేర్లకు, 18 సంవత్సరాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చెల్లింపులు పూర్తి చేయాలని కోరారు.
3. గుండంచర్ల తదితర గ్రామాల నిర్వాసితుల ఇంటి స్థలాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిగిలిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియలను ప్రత్యేక కాలపట్టికతో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
4. నిర్వాసితులను భయపెట్టడం, సంఘం నాయకులపై దౌర్జన్యం చేయడం, క్రిమినల్ కేసుల పేరుతో బెదిరించడం వంటి చర్యలు జరగకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు.
5. నిర్వాసితులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రతి సమస్యకు లిఖితపూర్వక పరిష్కార ప్రకటించాలని కోరారు.








కామెంట్‌లు (0)