23 పట్టణ స్థానిక సంస్థలు, తొలివిడత గ్రామ పంచాయతీల్లో పోలింగ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో గురువారం నిర్వహించనున్న 23 పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఇందులో 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టినట్లు పేర్కొన్నారు. తొలి విడత గ్రామ పంచాయతీల్లోనూ ఏకగ్రీవాలు మినహా మిగిలిన 3,191 సర్పంచ్, 25,105 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
పట్ణణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 4 మేయర్, 19 చైర్పర్సన్ పదవులకు మొత్తం 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,010 వార్డు సభ్యుల స్థానాలకు గానూ 41 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 5 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తికానుందని తెలిపారు. మిగిలిన 964 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ స్థానాలకు మొత్తం 2,968 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వెల్లడించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి బుధవారం ఉదయం పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, సిరా, బ్యాలెట్ పేపర్లు, ఓటరు లిస్టులు పంపిణీ పూర్తి చేసి పోలింగ్ కేంద్రాలకు జిల్లా యంత్రాంగం తరలించింది. పట్టణ స్థానిక సంస్థల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 30న నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు.







కామెంట్లు (0)