ఆర్యవీర్ సెహ్వాగ్, డేవిడ్ వార్నర్, ఇషాంత్ శర్మ కూడా..
16న గోవాలో ఐపిఎల్ మినీ వేలం
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-2027 మినీ వేలం రేసులో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ నిలిచాడు. డిసెంబర్ 16న గోవా వేదికగా ఈ మినీ వేలం జరగనుంది. అన్ని ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం 66 ఖాళీలుండగా.. ఇందులో విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు 25. వేలం బరిలో నిలిచిన మొత్తం 1,220 మంది ప్లేయర్లలో 939 మంది స్వదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతావారు విదేశీ క్రికెటర్లు. డిసెంబర్లో జరిగే వేలం బరిలో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కనీస ధర రూ.30 లక్షలతో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవల అండర్-19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 361 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇదే టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించిన మోహిత్ ఉల్వా కూడా రూ.30 లక్షల కనీస ధరతో ఐపీఎల్ ఆక్షన్‌లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలో పాల్గొంటున్నాడు. వార్నర్ చివరగా 2024లో ఐపీఎల్‌లో ఆడాడు. 2025 వేలంలో అన్‌సోల్డ్ అయిన ఈ ప్లేయర్ 2026 వేలంలో పాల్గొనలేదు. ఐపీఎల్‌లో 100కుపైగా మ్యాచ్‌లు ఆడిన వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ, బ్యాటర్ నితీశ్ రాణా కనీస ధర రూ.50 లక్షలతో అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. గత ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని భారత ఆటగాడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వేలంలో పాల్గొంటాడు. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల ఫైనల్ లిస్ట్‌ను డిసెంబర్ 4న విడుదల చేయనున్నారు.







కామెంట్‌లు (0)