బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపదేళ్లలో రూ.18.08 లక్షల కోట్ల రుణాలు రద్దు

-223 నిమిషాల క్రితం

పేదలకు ఛార్జీల మోతలు.. కార్పొరేట్లకు రుణ మాఫీలు 
- పదేళ్లలో రూ.18.08 లక్షల కోట్ల రుణాలు రద్దు
- రైటాఫ్‌ పేరిట నయా వంచన 
- టాప్‌-10 బ్యాంకుల వాటా రూ.11.73 లక్షల కోట్లు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 03:54 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రైటాఫ్‌ పేరిట నయా వంచన

  • టాప్‌-10 బ్యాంకుల వాటా రూ.11.73 లక్షల కోట్లు

ప్రజాశక్తి – బిజినెస్‌ డెస్క్‌ : రైటాఫ్‌..ఇదేదో రాత పనికి సంబంధించిన పని కాదు. కార్పొరేట్‌ ‌కంపెనీలకు, పాలక అనుయాయులకు దోచిపెట్టడానికి నెపంగా చూపిస్తున్న ఒక నయవంచన. సామాన్య ప్రజలు, రైతులు, చేతివృత్తిదారులు తీసుకొనే చిన్నాచితక రుణాలపై..ఖాతాలో సొమ్ము లేదని, పరిమితి మించి లావాదేవీలు చేశారని, ఆలస్య రుసుములు, ప్రాసెసింగ్‌ ‌ఫీజులు, అదనపు వడ్డీలు, అది సకాలంలో చెల్లించకుండా ఒక్క నిమిషం ఆలస్యమైనా భారీ మొత్తంలో భారాలు మోపి ముక్కుపిండి వసూలు చేసుకొనే బ్యాంకులు కార్పొరేట్‌ ‌పెద్దల విషయంలో మాత్రం ఆ పని చేయకుండా వారికి అదనపు సేవలందిస్తున్నారు. భూరి మొత్లాలను నిరర్థక ఆస్తులుగానో..వసూలు కాని సొమ్ముగానో పేర్కొంటూ రూ.లక్షల కోట్ల సొమ్మును కార్పొరేట్‌ ‌పెద్దలకు కైంకర్యం చేస్తున్నాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఈ నయవంచన దోపిడి ఆకాశమే హద్దుగా యదేశ్చగా సాగుతోంది. గడిచిన పదేళ్లలో ఏకంగా రూ.18.08 లక్షల కోట్లను ఇలా మొండి బకాయుల ముద్ర వేసి మోడీ సర్కార్‌ ‌రైటాఫ్‌ ‌చేసేసింది. అంటే మాఫీ చేసిందన్నమాట. రిజర్వుబ్యాంకు గణాంకాలే ఈ దోపిడిని బహిర్గతం చేశాయి. ఆర్‌‌బిఐ గణాంకాల ప్రకారం.. పదేళ్లలో బ్యాంకులు ఏకంగా రూ.18.08 లక్షల కోట్ల మొండి రుణాలను ఖాతాల నుంచి తొలగించాయి. ఇందులో ఐదేళ్లలో కేవలం 13 శాతం (రూ.1.32 లక్షల కోట్లు) మాత్రమే వసూళ్లయ్యాయని ఆర్‌‌బిఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మాఫీలో తొలి పది బ్యాంకుల వాటానే రూ.11.73 లక్షల కోట్లుగా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్‌‌టిఐ) ద్వారా వెల్లడైన ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం.. 2016-17 నుంచి 2025-26 వరకు షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు రూ.18,07,812 కోట్ల రుణాలను రద్దు చేశాయి. 2018-19లో అత్యధికంగా రూ.2.39 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. అనంతరం కూడా వరుసగా రెండేళ్లు రూ.2 లక్షల కోట్లకు పైగా ఈ ప్రక్రియ కొనసాగింది. 2025-26లో రుణాల రద్దు 8.2 శాతం తగ్గి రూ.1.44 లక్షల కోట్లకు చేరినప్పటికీ.. పదేళ్ల మొత్తం మాత్రం రూ.18 లక్షల కోట్లను దాటడం ఆందోళకరం. ఈ భారీ మొత్తాల్లో ఎన్ని రుణాలు తిరిగి వసూలయ్యాయి? రుణాలు ఇచ్చే సమయంలో అనుసరించిన ప్రమాణాలు ఏమిటి? పెద్ద రుణగ్రహీతల విషయంలో బాధ్యతను ఎంత కఠినంగా నిర్ధారిస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

​రుణాల మాఫీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా అధికంగా ఉంది. ఎస్‌బిఐ పదేళ్లలో రూ.3,03,160 కోట్ల రుణాలను రైట్‌ఆఫ్‌ చేయగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.1,31,170 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.1,14,701 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ రూ.1,13,112 కోట్లు, కెనరా బ్యాంక్‌ రూ.1,03,949 కోట్ల రుణాలను రద్దు చేశాయి. ఈ ఐదు బ్యాంకుల మొత్తం రూ.7.66 లక్షల కోట్లుగా ఉంది. తొలి పది బ్యాంకుల రైట్‌ఆఫ్‌ల మొత్తం రూ.11.73 లక్షల కోట్లకు చేరింది. అంటే మొత్తం రైట్‌ఆఫ్‌లలో సుమారు 65 శాతం ఈ పది బ్యాంకుల నుంచే జరిగాయి.

పెద్ద రుణాల విషయంలో వీడియోకాన్‌ గ్రూపు ఉదంతం ఈ సమస్య తీవ్రతను గుర్తుచేస్తోంది. వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ వ్యక్తిగత హామీలకు సంబంధించిన రూ.12,668 కోట్ల రుణాల వ్యవహారంలో ఇటీవల నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) దివాలా ప్రక్రియకు సంబంధించిన చర్యలు చేపట్టింది. ఇందులో కేవలం రూ.600 కోట్లు చెల్లిస్తే చాలని తెలిపింది. ఆ తర్వాత ఇది తీవ్ర వివాదం కావడంతో తీర్పును వెనక్కి తీసుకుంది. మరోవైపు ఫ్యూచర్‌ గ్రూపు ప్రమోటర్లు కిషోర్‌ బియానీ, రాకేష్‌ బియానీలు దాదాపు రూ.24వేల కోట్లు మేర బ్యాంక్‌‌లను ముంచారు. చిన్న రుణగ్రహీతపై ఒత్తిడి తెచ్చే బ్యాంకులు, భారీ రుణగ్రహీతల విషయంలోనూ అదే స్థాయి బాధ్యత, జవాబుదారీతనం చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణ వసూళ్ల విధానం పేద, ధనిక రుణగ్రహీతల మధ్య వివక్షతో కూడుకున్నదనే అనుమానాలు మరింత బలపడతాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్