వివరాలివ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి - అమరావతి : డిఎస్‌సి – 2025 నియామకాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఇడబ్ల్యూఎస్) కోటా కింద నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పలువురు ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. సుమారు 1,500 మంది అనర్హులు నకిలీ ఇడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారని, దీనిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు చెందిన పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలుకు చెందిన ప్రతాపరెడ్డి మరో ఎనిమిది మందితో కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇడబ్ల్యూఎస్ కోటా కింద 1,500 మంది అనర్హ అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి డిఎస్‌సి –2025లో ఉద్యోగాలు పొందారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఈ ఏడాది సెప్టెంబర్ 23న తాను సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపేలా సిబిఐని ఆదేశించాలని కోరారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు.






కామెంట్‌లు (0)