గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition23 పట్టణ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్..

16 నిమిషాల క్రితం

election
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 12:19 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 26న పోలింగ్.. 30న ఓట్ల లెక్కింపు

  • మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌‌చంద్ర పునేఠా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా పట్టణ ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నెల 26న పోలింగ్, 27న అవసరమైతే రీపోలింగ్, 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరోక్ష ఎన్నికలను డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి కొత్తకోట మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఈ నెల 14న ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తారు. 16వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి గడువు కాగా, 17న వాటి పరిశీలన చేపడతారు. 19న ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

​మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు..

గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల చేసి, 26న పోలింగ్ చేపడతారు. రెండో విడత ప్రకటన 16న వెలువరించి, 29న ఓటింగ్ నిర్వహిస్తారు. మూడో విడత నోటిఫికేషన్ 19న జారీ చేసి, డిసెంబర్ 2న ఎన్నికలు జరుపుతారు. ప్రతి విడతలోనూ పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్ పి, పోలీస్ కమిషనర్లు, డిఐజి, ఐజి, ఎన్నికల, వ్యయ పరిశీలకులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే జిల్లా కేంద్రాల్లోనూ ఈ సదుపాయం కల్పించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు ప్రదేశాల్లో సిసి కెమెరాలు, వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు భద్రత, పోలీసు ఎస్కార్ట్ కల్పించాలని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల 14న తిరుపతిలో 12 జిల్లాల ఎస్ పిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి ఎ మల్లికార్జున, ఐజి బి రాజకుమారి, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్