షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అంచనా
సకాలంలో మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
ప్రజాశక్తి - విజయనగరం : రాజాం పట్టణ ప్రధాన రహదారిలోని ఇండియన్ బ్యాంకులో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సీతారామ థియేటర్ పక్కన ఉన్న బ్యాంకు నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్న పిన్నింటి నాగరాజు అనే వ్యక్తి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో మంటలతో పాటు దట్టమైన పొగలు వెలువడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో బ్యాంకులోని ఫర్నిచర్, ఏసీలు, కంప్యూటర్లు, స్టేషనరీ కాలిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షలు మేర నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారి వై. గోవిందరావు తెలిపారు. అలాగే ఖాతాదారులకు సంబంధించిన లాకర్లోని బంగారం, నగదుకు ఎలాంటి నష్టం జరగలేదని బ్యాంక్ మేనేజర్ సబ్బద్దరి పాపారావు తెలియజేశారు. ఈ మేరకు విద్యుత్ పరికరాల వినియోగంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి గోవిందరావు సూచించారు. వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో పనిచేసే సిబ్బంది విధులు ముగించుకున్న అనంతరం విద్యుత్ పరికరాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.







కామెంట్‌లు (0)