న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించే ప్రపంచ పటాల్లో జమ్మూ-కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలను భారతదేశ అధికారిక పటం ప్రకారమే చిత్రీకరించాలని భారత్ స్పష్టం చేసింది. భారత సార్వభౌమ భూభాగాన్ని తప్పుగా లేదా తప్పుదోవ పట్టించే విధంగా చూపించే ఏ చిత్రీకరణనూ అంగీకరించబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆదివారం తెలిపారు. ప్రపంచ పటంలో ఖండాల భూభాగాలను మరింత కచ్చితంగా ప్రతిబింబించేలా మార్పులు చేయడం, ముఖ్యంగా ఆఫ్రికాకు సమాన ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యంగా ఐరాస సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 4న ఒక తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. ఈ తీర్మానం ఏ ప్రత్యేక ప్రపంచ పటాన్ని ఆమోదించడంగానీ, ప్రామాణీకరించడంగానీ చేయదని, అంతర్జాతీయ సరిహద్దులు, వివాదాస్పద భూభాగాలు, ప్రాంతాల పేర్లకు సంబంధించిన రాజకీయ పటరచనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు. జమ్మూ-కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలతో సహా భారత సార్వభౌమ భూభాగాన్ని అధికారిక భారత పటం ప్రకారమే చూపించాలని జైస్వాల్ పునరుద్ఘాటించారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై తమ వైఖరి స్పష్టమైనదని, స్థిరమైనదని, ఎలాంటి రాజీకి తావులేనిదని పేర్కొన్నారు.
టోగో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి 164 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఎస్టోనియా, జార్జియా, లిథువేనియా, మోల్డోవా, సెర్బియా, ఉక్రెయిన్ ఓటింగ్‌కు దూరంగా ఉండగా, అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది.








కామెంట్‌లు (0)