విశాఖపట్నం : ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలను అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి షెడ్యూల్డ్ విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అనంతరం ఉదయం 7:30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరనుంది అలాగే ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లనుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఈ తొలి ప్రయాణంలో పాల్గొన్న ప్రయాణికులకు గుర్తుగా ‘ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లు’ అందజేశారు.
మన్యం వీరుడి పేరు నామకరణం ....
అంతర్జాతీయ ప్రమాణాలతో ముస్తాబైన సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్, సోమవారం ఉదయం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నానికి ఉన్న అంతర్జాతీయ గుర్తింపు కోడ్ ‘VTZ’ ఇకపై భోగాపురం నుండే రన్ కానుంది.
విశాఖ ఎయిర్‌పోర్టు బైబై
ఇదిలా ఉండగా .... అటు షీలానగర్‌లోని పాత ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసింజర్ కోలాహలం ఆదివారంతో ముగిసిసోయింది. కేంద్ర పౌర విమానయాన శాఖ నిబంధనల ప్రకారం.. ఆదివారం రాత్రి నుండే ఇక్కడ కమర్షియల్ ఫ్లైట్స్ పూర్తిగా బంద్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ రన్‌వే కేవలం మిలిటరీ, నేవీ రక్షణ అవసరాలు, విఐపి విమానాల రాకపోకలకే పరిమితం కానుంది.
విశాఖ నుంచి ప్రత్యేక బస్సులు ....
ఇదిలా ఉండగా కొత్తగా ప్రారంభమైన భోగాపుం ఎయిర్‌పోర్టుకు విశాఖ నుంచి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు APSRTC పక్కా ప్లాన్‌తో ముందుకెళుతోంది. విమానాశ్రయానికి వెళ్లడానికి ఏరో ఎక్స్‌ప్రెస్ ల పేరుతో 20 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతోంది. ఆ బస్సులను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఎపి లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.







కామెంట్‌లు (0)