ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పడవ బోల్తా మత్స్యకారుడు మృతి

17 గంటల క్రితం

పడవ బోల్తా : మత్స్యకారుడు మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 06:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని దేవునలాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎముకలు కొరికే చలిలో తెల్లవారుజామున ఎగిసిపడే అలల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేటకు వెళ్లిన మత్స్యకారుడు తీరానికి విగతజీవిగా రావడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామానికి చెందిన అమర మోహనరావు (50) శనివారం వేటకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పడవ బోల్తా పడిన ఘటనలో పడవ భాగం తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. అతనితో పాటు పడవపై వేటకు వెళ్లిన మిగతా నలుగురు మత్స్యకారులు క్షేమంగా బయటపడి మోహనరావు మృతదేహాన్ని అదే పడవలో ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవునలాడకు చెందిన మృతుడు మోహనరావుకు భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చేపల వేటే ఆధారంగా బతుకుతున్నారు. ప్రస్తుతం సముద్రంలో చేపల వేట అనుకూలించే సమయం కావడంతో వేటకు వెళ్లారు. శనివారం వేకువజామున తోటి మత్స్యకారులైన జువ్వగడ్డ సూరరాజు, చింతల మోహనరావు, డి.రాజు, డి.వెంకటేష్ లతో కలిసి వేట సాగించారు. చేపలు పట్టుకుని తిరిగి తీరం వైపు వస్తుండగా రాళ్ల అంచు దగ్గర పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో మోహనరావు పడవ కింద పడిపోయి, పడవ అతని ఛాతీ భాగానికి తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. మిగిలిన వారంతా మోహనరావు మృతదేహాన్ని పడవలోకి తీసుకుని ఒడ్డుకు చేరారు. అనంతరం భార్య లక్ష్మికి, కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని తీరానికి చేరుకున్న మృతుని భార్య లక్ష్మి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ సిద్ధార్థ కుమార్ దేవునలాడ తీరానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబాన్ని మత్స్య శాఖ డిడి, ఎఫ్‌డిఒ సుమలత, ధర్మరాజు పాత్రో, జెడ్‌పి వైస్ చైర్మన్ గుంటు విజయకుమార్, గరం పెద్దలు తులే అపోజి, వాసు తదితరులు పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్