- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- పోలవరం, ఏలూరు జిల్లాల్లో పలు గ్రామాలకు నిల్చిన రాకపోకలు
ప్రజాశక్తి- యంత్రాంగం : ఎగువ నుండి వస్తున్న వరదతో పాటు శబరి పోటుతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ శనివారం అర్ధరాత్రి 35 అడుగుల్లో ఉన్న వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతూ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 43.10 అడుగులకు చేరింది. పరిస్థితిని సమీక్షించిన భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ట మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరగడంతో భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం చేరడంతో నీటిమట్టం వేగంగా పెరిగినట్టు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వరదల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. వరద నీటితో మునిగిపోయిన రహదారులు, వంతెనలు, కల్వర్టులు, వాగులు, ఇతర జలమార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగుల్లో వరద నీరు భారీగా చేరి లోతట్టు మిర్చి చేలు ముంపునకు గురయ్యాయి. గోదావరి, శబరి ఉప్పొంగడంతో విఆర్.పురం మండలంలోని పలు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద ఉధృతికి చింతరేగుపల్లి, కన్నాయిగూడెం, సుష్టివారిగూడెం, శ్రీరామగిరి గ్రామాల వైపు వెళ్లే ప్రధాన రహదారులపైకి నీరు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. వరి పొలాలు నీట మునిగాయి. శనివారం రాత్రి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని కుక్కునూరు-దాచారం మధ్య గుండేటి వాగు కాజ్‌వేపైకి వరద నీరు చేరి ప్రధాన రహదారిని ముంచెత్తింది. దీంతో, వాగు అవతల ఉన్న 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వేలేరుపాడు మండలంలోనూ వరద ఉధృతికి పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ధవళేశ్వరం వద్ద 9.80 అడుగుల నీటిమట్టం
ధవళేశ్వరంలోని సర్ కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం 9.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 7,12,345 క్యూసెక్కులు, కాలువలకు 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం రోడ్డు కం రైలు బ్రిడ్జి వద్ద 13.66 అడుగుల నీటిమట్టం నమోదైంది. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 8,75,512 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్లు డిఇ శ్రీనివాసరావు తెలిపారు. స్పిల్‌వే ఎగువన 32.550 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన 32.650 మీటర్లు నీటిమట్టం నమోదైంది. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం 11.210 మీటర్లుగా నమోదైనట్లు సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు.










కామెంట్‌లు (0)