శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు

10 నిమిషాల క్రితం

vore
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 01:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్రాల వాటా మరో 25 ఏళ్లు యథాతథం

- డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

- నవంబర్ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టి రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. 2023లో ఆమోదించిన చట్టాన్ని 2029 ఎన్నికల నాటికి అమలు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా తెలుస్తోంది. ఇందుకోసం జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ముడిపడి ఉన్న నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదిస్తోంది.

ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలున్నాయి. 50 శాతం పెంపుతో ఈ సంఖ్య సుమారు 850కి చేరే అవకాశముంది. రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల పంపిణీలో ప్రస్తుత నిష్పత్తిని 2051 వరకు కొనసాగించాలని ప్రతిపాదించారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు స్తంభింపజేయనున్నారు. గత ఏప్రిల్‌లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సంబంధిత బిల్లులు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయాయి. తాజా ప్రతిపాదనల్లో అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం స్థానాల పెంపు, రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించే అంశాలను చేర్చారు. తద్వారా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. జనాభాను నియంత్రించిన తమకు డీలిమిటేషన్ వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రస్తుత వాటాను మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలన్న ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ బిల్లులపై చర్చించేందుకు నవంబర్ 30 నుంచి లోక్‌సభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 2న రాజ్యసభ సమావేశం కానుంది. డీలిమిటేషన్ ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల అమలు, రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తి వంటి అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. బిల్లులోని నిబంధనలు, రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కొనసాగించే విధానం, రాజ్యాంగపరమైన అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్