- డిజిపి హరీష్‌కుమార్ గుప్తా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉగ్రవాద ముప్పులు, మారుతున్న భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆక్టోపస్ దళాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దనున్నట్లు డిజిపి హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా ‘ఆక్టోపస్ 2.0’ ప్రణాళిక కింద ప్రత్యేక ఇంటెలిజెన్స్, సైబర్, యాంటీ డ్రోన్ విభాగాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఉండవల్లిలోని నులకపేట ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో రూ.8 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. కంబాట్ ఫిజికల్ కండిషనింగ్ గ్రౌండ్, లాంగ్ ఫైరింగ్ రేంజ్‌ను ప్రారంభించగా, మాడ్యులర్ సీక్యూబీ టాక్టికల్ హౌస్, వర్టికల్ ట్రైనింగ్ సిస్టమ్, కమాండో ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ మాడ్యూల్, భద్రతా గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు 42 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంగణాన్ని ఆధునిక శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఎన్‌ఎస్‌జి ఆధ్వర్యాన హర్యానాలోని మానేసర్‌లో నిర్వహించిన ‘అగ్ని పరీక్ష’, ‘విస్ఫోట్ కవచ్’ జాతీయ పోటీల్లో ఆక్టోపస్ రెండు విభాగాల్లోనూ ప్రథమ స్థానాలు సాధించడం అభినందనీయమన్నారు. విజేతలైన కమాండోలకు ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. పాల్గొన్న సిబ్బందికి కమెండేషన్ డిస్క్‌లు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఐజిపి (ఆపరేషన్స్) సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆక్టోపస్ ఆధునీకరణకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఐజిపి (ఆక్టోపస్) ఎస్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రత్యేక శిక్షణ ప్రాంగణం కల్పించడంతో చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్టోపస్ ఎస్‌పి (అడ్మిన్) సిహెచ్ లక్ష్మీపతి, ఎస్‌పి (ఆపరేషన్స్ అండ్ ట్రైనింగ్) పి శశికాంత్, అధికారులు, కమాండోలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)