శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్దుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించాలి

1 గంట క్రితం

విద్యార్దుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించాలి
- ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి వి. శ్రీనివాసరావు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి వి. శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్య్రకమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం, సామాజిక సమానత్వ భావనను బలపరచడం, సాధారణ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏ.శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగం నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థ, లౌకికవాదం, సామాజిక న్యాయ విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. సమాజంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేయడంతోపాటు విద్యా, సామాజిక రంగాల్లో ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సామాజిక స్పృహ, రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించేందుకు భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ.. విద్యార్థులు రాజ్యాంగంపై ఒక పేజీ వ్యాసం రాసి పంపించాలని, వాటిలో ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామోహన్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడటంతోపాటు శాస్త్రీయ విద్యా విధానం కోసం కూడా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పోటీల్లో సిద్ధార్థ లా కాలేజీ, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ, ఆంధ్ర లయోలా కాలేజీ, స్టెల్లా కాలేజీ, కేబీఎన్ కాలేజీలకు చెందిన 11 బృందాలు పాల్గొన్నాయి. భారత రాజ్యాంగ పీఠిక, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, సామాజిక న్యాయం, స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర, భౌగోళిక అంశాలు తదితర విషయాలపై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యులు జి. క్రాంతికుమార్ అధ్యక్షత వహించారు. కె. లోకనాథం, డిగ్రీ కళాశాల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె. రమేష్ రాజ్యాంగ పీఠికను చదివించారు. కండెల్లి సురేంద్ర, ఆర్. రాజేష్ తదితరులు పాల్గొన్నారు. క్విజ్ మాస్టర్లుగా కిక్ ఫర్ యూపీఎస్సీ చైర్మన్ కండెల్లి సుధీర్, రోజా వ్యవహరించారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆరు కళాశాలల తరఫున బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసాపత్రంతో పాటు అంబేద్కర్ కిట్ బ్యాంకు పుస్తకాన్ని అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్