శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డీలిమిటేషన్‌పై రాజీ ప్రసక్తే లేదు

25 నిమిషాల క్రితం

freon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 01:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​- మహిళా రిజర్వేషన్ల ముసుగులో కుట్ర

- ప్రతిపక్షాల ఆగ్రహం

- ఒక్కో ఎంపికి రూ.150 కోట్ల ఆఫర్?

- పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందే రాజకీయ సెగలు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎంపిలను సమాయత్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ తన ఎంపిలందరూ నవంబర్ 29 ఉదయం 10 గంటలకల్లా ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశించింది. ఎన్‌సిపి (శరద్ పవార్) తమ లోక్‌సభ సభ్యులకు మూడు లైన్ల విప్ జారీ చేసింది.

రాజ్యాంగంపై దాడి : కాంగ్రెస్‌

లోక్‌సభలో మెజారిటీ కోసం మోడీ ప్రభుత్వం అక్రమ మార్గాలను అనుసరిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం విమర్శించారు. ఇది రాజ్యాంగంపై దాడి అని, ప్రతిపక్షాలు ఐక్యంగా ఎదుర్కొంటాయని చెప్పారు. మూడేళ్లకు పైగా పక్కనపెట్టిన మహిళా బిల్లును ఇప్పుడు మోసపూరితంగా తీసుకువస్తున్నారన్నారు. అసలు లక్ష్యం డీలిమిటేషన్ బిల్లేనని, నియోజకవర్గాలను అధికార పార్టీకి అనుకూలంగా మార్చే ప్రయత్నమన్నారు. ఈ ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పాత్రపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.

మా వైఖరిలో మార్పులేదు : స్టాలిన్

డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తమ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానాలు పెరిగినా తమిళనాడుకు ప్రస్తుతమున్న 7.18 శాతం వాటా తగ్గకూడదని, 1971 జనాభా ఆధారంగా రాష్ట్రాల మధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లు కొనసాగించాలని రెండు డిమాండ్లను పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ ప్రమాదాలపై తొలుత గళమెత్తింది డిఎంకేనని గుర్తుచేశారు. పదవుల కోసం సిద్ధాంతాలను వదులుకున్నవారు తమను ప్రశ్నించే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు.

బిల్లు దేశద్రోహపూరితం : సంజయ్ రౌత్

శివసేన (ఠాక్రే) ఎంపి సంజయ్ రౌత్ ఈ బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, మద్దతిచ్చేవారు చరిత్రలో దేశద్రోహులుగా మిగులుతారని అన్నారు. 2029 ఎన్నికల్లో ఓటమి భయంతోనే లోక్‌సభ స్థానాలను 860కి పెంచి పునర్విభజనకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఎంపికి రూ.150 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారని, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మధ్యవర్తులు మహారాష్ట్రలో బేరసారాలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇండియా బ్లాక్ ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలని, ఏ పార్టీ సొంతంగా నిర్ణయించరాదని కోరారు.

మహిళా రిజర్వేషన్ల ముసుగులో కుట్ర : సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌

​ మహిళా రిజర్వేషన్లను ముసుగుగా చేసుకుని డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా కృత్రిమ మెజార్టీ సృష్టించేందుకు మోడీ ప్రభుత్వం రాజకీయ విలీనాలు, పార్టీ ఫిరాయింపులు, ఎంపిల కొనుగోళ్లకు పాల్పడుతోందని సిపిఎం రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. ప్రజల తీర్పును వమ్ము చేయడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. మహిళా సాధికారతను ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవద్దని హితవు పలికారు. సోమవారం జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రజాస్వామ్య చరిత్రలో విషాద అధ్యాయంగా మారే ప్రమాదముందని జాన్‌ బ్రిట్టాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుత రూపంలో బిల్లును అంగీకరించం : సిపిఐ

​ డీలిమిటేషన్‌ బిల్లును ప్రస్తుత రూపంలో అంగీకరించేది లేదని సిపిఐ ఎంపి పి సంతోష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. 2023 సెప్టెంబరులో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ చట్టానికి వామపక్షాలు మద్దతు తెలిపాయని గుర్తుచేశారు. అయితే మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌ను షరతుగా పెట్టడం ఆమోదయోగ్యం కాదన్నారు.

​ముసాయిదా చూశాకే నిర్ణయం : సూలే

ఎన్‌సిపి (ఎస్‌పి) నేత సుప్రియా సూలే, ప్రభుత్వం ఎజెండాను వెల్లడించలేదని, బిల్లు ప్రతిని చూడకుండా స్పందించలేమని చెప్పారు. చేతికి వచ్చాక పార్టీలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్, జిఎస్‌‌టి బిల్లుల్లా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

బిజెపి అతిపెద్ద తప్పిదం: అఖిలేశ్

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఇది బిజెపి రాజకీయాల్లో అతిపెద్ద తప్పిదంగా మిగులుతుందని హెచ్చరించారు. పునర్విభజనతో దేశ రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. అలాగే బిజెడి ఎంపి సంతృప్త్ మిశ్రా ఒడిశాకు ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించాలని కోరారు. మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టాల్సిన అవసరం లేదని, ప్రస్తుత 543 స్థానాల్లోనే అమలు చేయవచ్చని అన్నారు. ఆర్‌జెడి ఎంపి మనోజ్ ఝా, డీలిమిటేషన్ కేవలం స్థానాల పెంపుకే పరిమితం కాదని, నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే ప్రమాదం ఉందన్నారు. అస్సాంలో గతంలో జరిగిన పరిణామాల తరహాలో రాజకీయ ప్రేరేపిత పునర్విభజన జరగవచ్చని హెచ్చరించారు. పార్టీల ప్రయోజనాల ఆధారంగా చేపడితే సమాఖ్య సమతుల్యత, జాతీయ ఐక్యత దెబ్బతింటాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్