బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపొంగిపొర్లుతున్న వాగులతో వరద ముప్పు

1 గంట క్రితం

rain.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 11:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

  • సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

​ప్రజాశక్తి - అమరావతి బ్యూరో​ : ఇటీవల పడిన భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్‌‌టిజిఎస్‌ ‌కేంద్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వాగులు, వంకల్లో పెరుగుతున్న వరద ప్రవాహాలపై ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగుల కారణంగా వివిధ రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పడిన వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి 25,375 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. నల్లమడ డ్రెయిన్‌కు 47 వేల క్యూసెక్కులు, ఎర్రకాలువకు 19,756 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం ఉన్నట్లు వివరించారు. తమ్మిలేరు, గోనెల వాగుకు 5,500 క్యూసెక్కులు, పెద్దవాగుకు 9,500 క్యూసెక్కుల మేర వరద ప్రవాహాలు వస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పడుతున్న వర్షాల కారణంగా ఈ కాలువలకు మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. కారంచేడు నుంచి కొత్తపట్నం, చీరాల, చిలకలూరిపేట, పర్చూరు ప్రాంతాల్లోని ముంపు పరిస్థితులను త్వరితగతిన చక్కదిద్దేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. రహదారులపై రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం తదితర గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న నీటిపారుదల చెరువులు పూర్తిగా నిండిపోయి పొంగిపొర్లుతున్నాయని ఏలూరు జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్