- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం
ప్రజాశక్తి - కె.కోటపాడు (అనకాపల్లి) ఎంఎస్‌ఎంఇ పార్క్ కోసం బలవంతపు భూ సేకరణను అపాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం గొండుపాలెం గ్రామంలో పార్కుకు భూమి పూజ చేసిన స్థలం వద్ద ఆదివారం బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా భూములు తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. 40 సంవత్సరాలుగా రైతులు ఆ భూములను నమ్ముకుని, వాటిపైనే ఆధారపడి బతుకుతున్నారని, 2006లో ఇక్కడి రైతులకు ప్రభుత్వం పట్టాలు సైతం ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు బలవంతంగా ఆ భూములను తీసుకుంటే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. భూములను ఇచ్చేయాలని రైతులపై దౌర్జన్యం చేసి కారుచౌకగా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతుల నుంచి భూములు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన బాబు, మండల కార్యదర్శి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)