- మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి
- తమ మద్దతుతో రూపొందించిన ప్రస్తుత విధానాన్ని సవరించాలని సూచన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సోషల్‌మీడియా ఎక్స్‌లో చేసిన ప్రకటనలో ప్రస్తుతమున్న సిఇసి ఎంపిక కమిటీని సమీక్షించాలని, ప్రధాన మంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే పాత కమిటీని తక్షణమే పునరుద్ధరించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఇసిఐనెట్ నిర్వహణపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు ప్రజల్లో అనేక ప్రశ్నలు, సందేహాలకు తావిచ్చాయని తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం, పునరుద్ధరించడం వంటి విషయాల్లో ఏయే అభ్యంతరాలు నమోదయ్యాయి, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వ్యవస్థ ఎంత పారదర్శకంగా పనిచేసింది అనే దానిపై ప్రజలకు స్పష్టత రావాలన్నారు. వీటిపై నమ్మకం కలిగించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అది అంతిమంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని బలపరచాలని తెలిపారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును రక్షించాలని, ప్రజలు భయపడకుండా ఆ హక్కును వినియోగించుకునేలా వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉంటే సరిపోదని, అది ఉన్నట్లు కనిపించాలని తెలిపారు. 2023లో వైసిపి మద్దతు పొందిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా షరతులు మరియు పదవీకాల చట్టం, 2023’ను ప్రస్తుత నేపథ్యంలో పునఃపరిశీలించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం (అధికార పార్టీ) ముందుకు వచ్చి ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి, ప్రధాన మంత్రితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్‌ను నియమించే విధంగా బిల్లును సవరించాలని కోరారు.
పరీక్షాధికారి ఎంత నిజాయితీపరుడైనప్పటికీ, విద్యార్ధే పరీక్షాధికారిని నియమించడం ఎప్పుడూ ఆరోపణలకు తావిస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడున్న ప్రక్రియను మార్చి తటస్థంగా ఉండే వారితో భర్తీ చేయడం మంచిదని సూచించారు. దీనివల్ల ఎన్నికల సంఘం గౌరవం, విశ్వాసం తిరిగి వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అధికారంలో ఉన్న పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, దీనిపై వైసిపి అనేక అప్పీళ్లు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కూడా, డివిజన్లను పున:వ్యవస్థీకరించిన తీరుపై ప్రతిపక్ష పార్టీగా తాము లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారని తెలిపారు. ఇటువంటి చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, పారదర్శకత జవాబుదారీతనం అనేవి ప్రజాస్వామ్యంలో ఏ సంస్థయినా ఎలా పనిచేస్తుందనేదానికి నిజమైన గీటురాళ్లని వాటిని రక్షించడమే ఎన్నికల కమిషన్ ప్రాథమిక బాధ్యతని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)