సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండు కొత్త మండల పరిషత్తుల ఏర్పాటు

16 సెప్టెంబర్, 2026

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 06:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై.రామవరం రెవెన్యూ మండలాన్ని వై.రామవరం, గుర్తేడు మండలాలుగా విభజించిన నేపథ్యంలో మండల ప్రజా పరిషత్తులను ప్రభుత్వం పునర్‌‌వ్యవస్థీకరించింది. ఇప్పటికే ఉన్న వై.రామవరం మండల ప్రజా పరిషత్తును పునర్‌‌వ్యవస్థీకరించడంతో పాటు గుర్తేడు కేంద్రంగా కొత్త మండల ప్రజా పరిషత్తును ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మండల ప్రజా పరిషత్తుల పరిధి, ఆయా రెవెన్యూ మండలాల సవరించిన సరిహద్దులకు అనుగుణంగా ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌ ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. వై.రామవరం మండల పరిషత్తులో 12 గ్రామ పంచాయతీలు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలో 15,051 మంది జనాభా ఉన్నారు. మొత్తం 4 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఉంటాయి. గుర్తేడు మండల పరిషత్తులో 5 గ్రామ పంచాయతీలు, 13,563 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 4 ఎంపిటిసి స్థానాలు ఉంటాయి. అలాగే కర్నూలు జిల్లాలో ఆదోని రెవెన్యూ మండలాన్ని ఆదోని-1, ఆదోని-2 మండలాలుగా విభజించిన నేపథ్యంలో మండల ప్రజా పరిషత్తులను ప్రభుత్వం పునర్‌‌వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న ఆదోని మండల ప్రజా పరిషత్తును ఆదోని-1గా పునర్‌‌వ్యవస్థీకరించడంతో పాటు ఆదోని-2 మండల ప్రజా పరిషత్తును కొత్తగా ఏర్పాటు చేసింది. ఆదోని-1లో 21 గ్రామ పంచాయతీలు, 43,595 మంది జనాభా ఉన్నారు. మొత్తం 14 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు ఉంటాయి. ఆదోని-2లో 19 గ్రామ పంచాయతీలు, 59,298 మంది జనాభా ఉన్నారు. మొత్తం 17 ఎంపిటిసి స్థానాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్