మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్‌ : మైలవరం ఎమ్మెల్యే

1 గంట క్రితం

reddygudem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 04:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఎన్‌టిఆర్‌ జిల్లా : మాజీ సీఎం జగన్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నీతులు చెబుతున్నారని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మంగళవారం పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలపై జగన్‌ చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. కొండపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ అంశాన్ని రాజకీయ రాద్ధాంతంగా మార్చడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.11 వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమవుతున్న సమయంలో డీఎస్సీని అడ్డుపెట్టుకుని రాజకీయ ఆందోళనలు చేయడం వ్యూహాత్మక ప్రయత్నంగా కనిపిస్తోందని అన్నారు. డీఎస్సీ ద్వారా 16,500 ఉద్యోగాలు కల్పించామని, వాటిని ఫేక్ ఉద్యోగాలని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గానికి కూడా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు వచ్చాయని, నియామకాల్లో అక్రమాలు జరిగి ఉంటే స్థానికంగా తమకు తెలియకుండా ఎలా ఉంటుందని అన్నారు. వేలాది మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన నియామక ప్రక్రియపై నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో అనవసరమైన ఆందోళన ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ రౌడీమూకతో నిరసనలు, దూషణలు, ఘర్షణలకు దిగడం సరికాదని అన్నారు. టీచర్లను అసభ్య పదజాలంతో దూషించడం జగన్‌ మార్కు నిరసన అని ఎద్దేవా చేశారు. మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని జగన్‌ అల్లర్లపై, డీఎస్సిపై రివ్యూ చేసి, తెలుగుదేశం గుండాలు దాడులు చేశారని ఆరోపించారన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. మీడియాలో వీడియోలు, అన్ని పత్రికల్లోని వార్తల్లో ప్రజలంతా వాస్తవాలన్నీ గమనించారన్నారు.

అబద్ధాల పత్రిక చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా వార్తలు రాయించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి కూడా పరీక్ష పత్రాలను రిసార్టులకు తీసుకెళ్లి డ్రైవర్లు, తోటమాలీలు, ఇతర సిబ్బందితో మూల్యాంకనం చేయించారన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, యువత భవిష్యత్తు, ఉద్యోగాలు, సంక్షేమం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని గత ఐదేళ్ల పాలనలో ఏం జరిగింది, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందో బేరీజు వేసుకోవాలని వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. "ఉన్మాది కావాలా..? అభివృద్ధి ప్రదాత కావాలా..? “రాష్ట్రానికి అభివృద్ధి కావాలా? అరాచక శక్తులు కావాలా?” అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. జగన్ పై ఉన్న లిక్కర్ కేసులు, ఆరోపణలు చర్చకు వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే డీఎస్సీ అంశాన్ని పదేపదే తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా కుంభకోణం, నాసిరకం బ్రాండ్లతో అక్రమ సంపాదనకు సంబంధించి అప్రూవర్ గా మారిన సత్యప్రసాద్ అన్ని విషయాలు చెప్పారన్నారు. వైఎస్ జగన్‌ తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులకు, తనపై ఉన్న ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఇతరులపై కేసులు, విచారణలు కోరడం రాజకీయంగా బాధ్యతారాహిత్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్