హైదరాబాద్ : తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మెగాస్టార్ చిరంజీవి, సినీ రంగంలో అడుగుపెట్టి నేటితో సరిగ్గా 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన మొదటి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన సెప్టెంబర్ 22, 1978 నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
ఆ రోజే తన పేరు ‘శివశంకర వరప్రసాద్’ నుంచి ‘చిరంజీవి’గా మారిందని, అదే నేడు తనకు శాశ్వత గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ పయనంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించానని, అనేక విజయాలు, పురస్కారాలు అందుకున్నానని తెలిపారు. తనను నమ్మి అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, కొత్త కోణాల్లో ఆవిష్కరించిన దర్శకులు, తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని విజయాల కంటే అభిమానులు తనపై కురిపించే ప్రేమాభిమానాలే అత్యంత విలువైనవని, తనను సొంత కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి ధన్యవాదాలు తెలియజేశారు.
చిరంజీవి నటుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినప్పటికీ, కె.వాసు దర్శకత్వంలో ఆయన ‘నరసింహ’ పాత్రలో నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రమే మొదటగా వెండితెరపై విడుదలైంది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి చేరువవుతున్నప్పటికీ, నేటికీ అదే ఉత్సాహంతో మెగాస్టార్ ‘విశ్వంభర’, ‘కాకా’ వంటి వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.







కామెంట్‌లు (0)