సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎస్ నుంచి ఓపిఎస్‌ కు - ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు

4 గంటల క్రితం

From CPS to OPS AP Government Issues Orders
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి లో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సిపిఎస్ నుంచి ఓపిఎస్ ‌‌కు మారేందుకు విధి విధానాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిపిఎస్ నుంచి ఓపిఎస్‌కు మార్పు కోసం ఆర్థిక శాఖ ద్వారా జీఓ ఎంఎస్ నంబర్ 158 జారీ చేసింది. 2004 సెప్టెంబర్ 1 కి ముందు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలై, ఆ తేదీ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ఒకేసారి అవకాశం (వన్-టైమ్ ఆప్షన్) కల్పించింది. ఓపిఎస్‌ కు మారేందుకు ఆప్షన్ నమోదు చేసుకోవడానికి 2026 డిసెంబర్ 31 వ తేదీని ఆఖరి గడువుగా విధించింది. దరఖాస్తుల స్వీకరణ, ఆప్షన్ల పరిశీలన ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో 'నిధి' పోర్టల్ ద్వారా మాత్రమే నిర్వహిస్తారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులతోపాటు పదవీ విరమణ పొందినవారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు (ఫ్యామిలీ పెన్షనర్లు) కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ తొలి నియామక అధికారి నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, సెలెక్షన్ లిస్ట్, అపాయింట్మెంట్ ఆర్డర్, విధుల్లో చేరినట్లు తెలిపే ధ్రువీకరించిన కాపీలు విధిగా పొందాలి. తొలి నియామక అధికారి 15 పని దినాల్లోగా ఉద్యోగులకు సంబంధిత ధ్రువపత్రాల సర్టిఫికెట్ కాపీలను అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓపిఎస్ ఆప్షన్ ఆమోదం పొందిన వెంటనే సదరు ఉద్యోగులను జిపిఎఫ్ లేదా ఇతర ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి మారుస్తూ నిబంధనలు రూపొందించనుంది. సిపిఎస్ కార్పస్ ఫండ్‌లోని ఉద్యోగి వాటాను వారి జిపిఎఫ్ ఖాతాలో జమచేసి, ప్రభుత్వ వాటా, దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాకు ఆర్థిక శాఖ మళ్లించనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్