- ఫార్మా కంపెనీ కోసం భూములు స్వాధీనం చేసుకునేందుకు యత్నం
- ప్రతిఘటించిన సిపిఎం నాయకులు సహా ఏడుగురు అరెస్టు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అప్పన్నపాలెం, గొరపూడి, జెడ్.చింతువ రైతుల భూములను లారస్ ఫార్మా కంపెనీ కోసం స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా శనివారం నిర్వాసిత రైతులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో రైతులకు మద్దతు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.శంకరరావు, రాంబిల్లి మండల కార్యదర్శి జి.దేముడు నాయుడు, మండల కమిటీ సభ్యులు ధోని కాశి, ఎర్రిపల్లి రాము సహా ముగ్గురు నిర్వాసిత రైతులను పోలీసులు అరెస్టు చేసి రాంబిల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భూముల స్వాధీన క్రమంలో పెన్షింగ్ వేస్తూ ప్రభుత్వం దౌర్జన్యకాండకు తెగబడింది. భారీగా పోలీసులను మోహరించి భయానక వాతావరణం సృష్టించింది. ‘ఈ మండలంలోని పైన తెలిపిన గ్రామాలకు చెందిన ఎస్‌ఇజెడ్ నిర్వాసిత రైతుల నుంచి లారస్ ఫార్మా కంపెనీ కోసం సుమారు 576 ఎకరాల జిరాయితీ, ప్రభుత్వ భూములను సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం తమకు సరిపోదని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండగానే రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయకుండా భూముల చుట్టూ బౌండరీ ఏర్పాటు చేసి కంచె వేయడానికి వందలాది మంది పోలీసులను మోహరించడం అన్యాయం’ అని సిపిఎం నేతలు అన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించిన తరువాతే భూ సేకరణ చర్యలు చేపట్టాలని, న్యాయస్థానం పరిధిలో ఉన్న భూ వ్యవహారంలో దౌర్జన్యపూరిత చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, పోలీసు నిర్బంధకాండను సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఓ ప్రకటనలో ఖండించారు. సిపిఎం నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సిఐటియు, డివైఎఫ్ఐ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాంబిల్లిలో రాస్తారోకో నిర్వహించారు.
ప్రభుత్వ చర్యలతో ఆందోళనకు గురై రైతు మృతి
ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ జరుగుతోందన్న విషయం తెలిసి గొరపూడికి చెందిన రైతు లాలం నరసింహారావు మృతిచెందాడు. భూమిని కోల్పోతామన్న భయం, అధికారులు వ్యవహరించిన తీరు, పోలీసు బలగాల మోహరింపుతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, ఈ నేపథ్యంలోనే రైతు నరసింహారావు ప్రాణాలు వదిలారని స్థానికులు చెబుతున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు, భార్య ఉన్నారు. ‘రైతుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన తర్వాత దానిని అభివృద్ధి అని పిలవకండి సార్’ అని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెట్టారు.









కామెంట్‌లు (0)