శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.25 వేల సాయం అందించాలి..

30 అక్టోబర్, 2026

Government must provide relief to cyclone victims CPM central team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తుపాను బాధితులను ఆదుకోవాలి...: రమాదేవి

  • ​తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిపిఎం బృందం పర్యటన

ప్రజాశక్తి - రాజోలు, యు.కొత్తపల్లి : అర్నబ్ తుపాను బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు, కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు తదితరులతో కలిసి ఆమె పర్యటించారు. పాడైన పంటలు, కూలిన ఇళ్లను స్వయంగా పరిశీలించారు. యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేట, రంగంపేట, కొత్తపట్నం, మాయాపట్నంలో నిర్వాసితులైన మత్స్యకారులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ... తుపాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం సంతృప్తికరంగా లేదన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే రైతులు నష్టపోయారని, తుపానుతో మొత్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయార‌ని తెలిపారు. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్‌ ‌చేశారు. మృతులకు రూ.25 లక్షలు, మునిగిపోయిన ఇళ్లకు రూ.25 వేలు, చేనేత, మత్స్యకార్మికులు, చిరు దుకాణాదారులకు రూ.50 వేలు చొప్పున, ఆటో కార్మికులు, తోపుడు బండ్లకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని కోరారు. ఆహార పంటలకు ఎకరాకు రూ.25 వేలకు తగ్గకుండా ఇవ్వాలని, ఉద్యాన పంటలకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు నష్టపరిహారం ఇవ్వాలని, పడిపోయిన కొబ్బరి చెట్టుకు రూ.20 వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. కౌలురైతులకూ సాయం అందేలా చూడాలని, వ్యవసాయ కార్మికులకు పనిలేనందున ప్రతి కుటుంబానికి రూ.పది వేలు చొప్పున అదనపు సహాయం అందించాలని కోరారు. సముద్రం చొచ్చుకురావడంతో మత్స్యకారుల ఇల్లు, గృహోపకరణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం మాట్లాడుతూ తుపాన్ల సమయంలో తీరప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సముద్ర తీరానికి కనీసం కిలోమీటరు దూరంలో ప్రభుత్వమే భూమిని సేకరించి పక్కా ఇళ్లు నిర్మించాలని కోరారు. ఉప్పాడ తీరంలో సముద్ర ఉధృతికి మత్స్యకార గ్రామాల స్వరూపమే మారిపోయిందన్నారు. ఈ గ్రామాల్లో మత్స్యకారులు కట్టుబట్టలతో మిగిలారని తెలిపారు. నేటికీ వారు పరాయి పంచనే కాలం వెళ్లదీస్తున్నారన్నారు. పాడైన బోట్లను బాగుచేయించాలని, వేట సామగ్రిని ఉచితంగా అందించాలని కోరారు. ఈ బృందంలో సిపిఎం కోనసీమ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, తదితరులు ఉన్నారు.

1793360550426-1793360617646-3452.jpg
02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్