- పేదలకు పట్టాలివ్వాలి
- కార్పొరేట్లకు భూములు, సహజ వనరులు ధారాదత్తం తగదు : లోకనాథం
ప్రజాశక్తి - అనకాపల్లి : అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం విజె.పురం గ్రామంలోని ఉరలోవ కొండ ప్రాంతంలో 25 ఎకరాల్లో గ్రానైట్ తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ నోటీసును కాలుష్య నియంత్రణ మండలి ఇవ్వడం దారుణమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలివ్వకుండా కార్పొరేట్లకు భూములను, సహజ వనరులను కట్టబెట్టడం తగదన్నారు. ఉరలోవ కొండ విషయంలో గ్రానైట్ తవ్వకాల కోసం ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ నోటీసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఉరలోవ కొండ ప్రాంతంలో పర్యటించి కొమిరి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం 80 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయల సహజ వనరులను కొల్లగొట్టేందుకు కార్పొరేట్ శక్తులకు టిడిపి కూటమి ప్రభుత్వం అనుమతులివ్వటం చట్ట వ్యతిరేకమన్నారు. ఈ ప్రాంతంలో తరతరాలుగా పేదలు జీడి, మామిడి, సరుగుడు పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారికి ఎలాంటి ఆధారమూ లేదని తెలిపారు. ఈ ప్రాంతంలో మైనింగ్ చేపట్టడం వల్ల పంటలు దెబ్బతిని జీవనాధారాన్ని ప్రజలు కోల్పోవడంతో పాటు నీరూ కాలుష్యమవుతుందని, భూగర్భ జలాలు అడుగంటిపోతాయని తెలిపారు. పట్టాలివ్వాలని ప్రజలు ఎన్నోసార్లు మొరపెట్టుకుంటే ఆ పని చేయని ప్రభుత్వం.. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం భూములను ధారాదత్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపద సృష్టిస్తానని చెబుతున్నారని.. పేదల భూములను లాక్కోవడమే సంపద సృష్టా ? అని లోకనాథం ప్రశ్నించారు. బాక్సైట్, లేటరైట్, గ్రానైట్ లాంటి సంపదను కారు చౌకగా కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ నోటీసులు రద్దుచేసి కొమిరి, గుడ్డిబంద, కవగుంట, శ్రీరాంపురం, ఒమ్మలి, జగన్నాధపురం, కృష్ణాపురం గ్రామ ప్రజలకు సాగు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, మాడుగుల మండల నాయకులు నరసింహమూర్తి, భవాని పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)