జెఎమ్‌డి శివప్రసాద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్ఆర్‌టిసి ఆదాయానికి గండికొట్టే లీకేజీలను అరికట్టడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జరిగే అక్రమాలను గుర్తించి నివారించాలని డిపో మేనేజర్లకు సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జెఎమ్‌డి) ఎం శివప్రసాద్ సూచించారు. ఎపిఎస్ఆర్‌టిసి ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ, సంస్థ ప్రధాన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యాన డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం తొలి బ్యాచ్‌ను మంగళవారం విజయవాడలోని ఎపిఎస్ఆర్‌టిసి ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. సంస్థ ఆదాయాన్ని పరిరక్షించడం ప్రతి డిపో మేనేజర్ బాధ్యతని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, రికార్డులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదాయ నష్టాలకు దారితీసే లోపాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కెఎస్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. సంస్థలో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడం, సాంకేతిక అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, ఆదాయాన్ని పరిరక్షించడం, డిపోల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) జివి రవి వర్మ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)