మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటర్కీ స్టీల్ ప్లాంట్‌‌లో భారీ పేలుడు

12 నిమిషాల క్రితం

టర్కీ స్టీల్ ప్లాంట్‌‌లో భారీ పేలుడు 
-16 మంది కార్మికులు మృతి
-  అదుపుతప్పి కొలిమిలో పడ్డ క్రేన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 11:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 16 మంది కార్మికులు మృతి

  • అదుపుతప్పి కొలిమిలో పడ్డ క్రేన్‌

ఇస్తాంబుల్‌ : టర్కీ ఉక్కు పరిశ్రమలవో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇజ్మీర్ ప్రావిన్స్‌లోని అలియాగా ప్రాంతంలో ఉన్న హబాస్ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని హోంమంత్రి ముస్తఫా సిఫ్ట్సీ తెలిపారు. ప్రావిన్షియల్ గవర్నర్ సులేమాన్ ఎల్బాన్ తెలిపిన వివరాల ప్రకారం, ప్లాంట్‌లో బాయిలర్‌ను మార్చే పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం ఉపయోగిస్తున్న క్రేన్ అదుపుతప్పి, ఉక్కు తయారుచేసే కొలిమిలో పడింది. దీంతో భారీ పేలుడు సంభవించి, సమీప ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. బాయిలర్ మార్పిడి పనుల కారణంగా ప్లాంట్‌లో అప్పటికే ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ ఫ్యాక్టరీలో 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఒక్కసారిగా పేలుడు..

పేలుడు శబ్దం అత్యంత భయంకరంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూమి ఒక్కసారిగా కంపించినట్లు అనిపించిందని, మొదట భూకంపం వచ్చిందేమోనని భయపడ్డామని చెప్పారు. పేలుడు తర్వాత ప్లాంట్ నుంచి దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగసిపడిన దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. ​ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేయడంతో పాటు, ప్లాంట్‌లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపట్టా యి. క్షత గాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తు న్నారు.

​భద్రతా లోపాలే కారణమా?

ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలు, బాధ్యులెవరనే అంశాలపై న్యాయపరమైన, పరిపాలనా విచారణకు ఎర్డోగాన్ ఆదేశించారు. క్రేన్ కొలిమిలో ఎందుకు పడింది, పనుల సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ ఈ కేసు విచారణకు నలుగురు ప్రభుత్వ న్యాయవాదులను నియమించారు. మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం ప్రకటించారు.

1987లో ప్రారంభం.. ఏటా 45 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి

హబాస్ స్టీల్ ప్లాంట్‌ను 1987లో ప్రారంభించారు. ఈ పరిశ్రమ ఏడాదికి సుమారు 45 లక్షల టన్నుల ఉక్కును తయారు చేయగలదు. ప్లాంట్ ఉన్న అలియాగా ప్రాంతం పెద్ద ఓడరేవుకు ప్రసిద్ధి. ఇక్కడ ఓడలను విడదీసి, వాటి భాగాలను తిరిగి ఉపయోగించే పరిశ్రమలు కూడా ఉన్నాయి. అయితే ఈ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోందని గతంలో విమర్శలు వచ్చాయి. తాజా పేలుడు ఘటనతో పారిశ్రామిక భద్రత, కార్మికుల రక్షణపై మరోసారి చర్చ మొదలైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్