మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition4న తిరుపతిలో డిజిపిలు, ఐజిపిల జాతీయ సదస్సు

24 నిమిషాల క్రితం

4న తిరుపతిలో డిజిపిలు, ఐజిపిల జాతీయ సదస్సుకు
             హాజరు కానున్న ప్రధాని మోడీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 11:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • హాజరు కానున్న ప్రధాని మోడీ

  • భద్రత, ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : వచ్చే నెల 4 నుంచి 6వ తేదీల్లో తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్‌) వేదికగా అఖిల భారత డిజిపిలు, ఐజిపిల జాతీయ సదస్సు జరగనుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరు కానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ

సదస్సులో దేశ అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయం, నిఘా సమాచార మార్పిడి, శాంతిభద్రతల పరిరక్షణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల డిజిపిలు, ఐజిపిలు, సుమారు 200 మంది ఐపిఎస్ అధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, కేంద్ర భద్రతా సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రధాని రానుండడంతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్... జిల్లా ఎస్‌‌పి ఎల్.సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐసర్ పరిసరాల్లో భద్రతా వలయాలు ఏర్పాటు, వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు సిద్ధం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రధాని, కేంద్ర మంత్రుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పోలీసు ఉన్నతాధికారులకు వసతి తదితర వాటిపై చర్చించారు.

నగరంలో రహదారుల మరమ్మతులు, సుందరీకరణ. నిరంతర విద్యుత్, తాగునీటి సరఫరా, వైద్య బృందాలు, అత్యవసర వైద్య సేవలు, పారిశుధ్యం, అగ్నిమాపక ఏర్పాట్లు, సమాచార వ్యవస్థ, కమ్యూనికేషన్ సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పోలీసు బందోబస్తు, ప్రభుత్వ, ప్రైవేటు హోటళ్లు, అతిథి గృహాల్లో వసతి ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఐసర్‌తో పాటు ఐఐటి తిరుపతి, ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ ప్రాంతాల్లోనూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు చేయాలని సూచించారు. ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్