శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిమిడిన అన్నం

50 నిమిషాల క్రితం

1793350783634.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 01:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మెట్టిరేవు పునరావాస కేంద్రంలో కష్టాలు

  • సిఎం పర్యటన నేపధ్యంలో హడావిడిగా దిద్దుబాటు చర్యలు

  • తాము చెప్పిందే చెప్పాలంటూ బాధితులకు హెచ్చరికలు

​ప్రజాశక్తి - భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా రామన్నపాలెం మెట్టిరేవు పునరావాస కేంద్రంలో తుపాను బాధితులు అనేక కష్టాలకు గురయ్యారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎలా ఉన్నప్పటికీ వీరికి సరైన భోజనం కూడా అందలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఈ శిభిరాన్ని సందర్శించారు. అంతకుముందు వరకు ఇక్కడ ఉన్న బాధితులకు చిమిడిన అన్నాన్ని సరఫరా చేశారు. ఆ భోజనం కూడా సమయానికి అందివ్వలేదు. చిమిడిపోయిన అన్నం ముద్దలు, ఉడికీఉడకని బంగాళాదుంపలు, దొండకాయ కూర ఇచ్చారు. నీళ్ల సాంబారుతో సరిపుచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో అక్కడకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు బాధితులు ఈ విషయాలు చెప్పారు. అయితే. ముఖ్యమంత్రి వద్ద మాత్రం వీటి ప్రస్తావన రాలేదు. ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు తాము చెప్పిందే మాట్లాడాలని, మిగతావేవీ మాట్లాడకూడదని అధికారులు వీరిని హెచ్చరించినట్లు సమాచారం. పునరావాస కేంద్రం నిర్వాహకులపై ఎటువంటి ఫిర్యాదులూ చెప్పొద్దని.. చెప్పింది మాత్రమే వినాలని ఆదేశించారు. తీరప్రాంతంలోని ఒక పంచాయతీ కార్యదర్శి ఏమి మాట్లాడాలో స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఇదే చెప్పాలని, లేకపోతే తర్వాత పరిణామాలు వేరే ఉంటాయని బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. నిర్వాసితులు, గ్రామస్తులు, స్థానిక నాయకులు కూడా ఆ కార్యదర్శి స్క్రిప్ట్ పట్టి పట్టి మరి చదివారు. అప్పటికప్పుడు నిత్యావసర సరుకులు, ఉల్లిపాయలు దిగుమతి చేసి తుపాను బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అవీ ఆధార్ కార్డు ప్రాతిపదికన అందజేశారు. ఆధార్ లేకపోతే సరుకులు ఇవ్వలేదని బాధితులు తెలిపారు. అసలీ పునరావాస కేంద్రానే అప్పటికప్పుడు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతంలోని వారినంతా కేంద్రానికి పిలిపించారని, వారి పేర్లను అప్పటికప్పుడు నమోదు చేసుకుని శిఓణ ఇచ్చారని సమాచారం.

అధికారుల ఉరుకులు పరుగులు

పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గురువారం రాత్రి ముఖ్యమంత్రి ‌పర్యటన షెడ్యూల్‌ ఖరారు కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం చంద్రబాబు వచ్చే వరకూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కానీ, పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. అర్నబ్ తుపాన్ ధాటికి నర్సాపురం, మొగల్తూరు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వరి పంటతో పాటు, ఉద్యాన పంటలు, కూరగాయల పంటలుపూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. మూడు రోజులుగా జిల్లా అంతా అంధకారంలోనే మగ్గిపోతుంది.

1793350783716(1).jpgపంచాయతీ కార్యదర్శి రాసిచ్చిన స్క్రిప్ట్ బట్టీ పడుతున్న స్థానికులు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్