25 శాతం పెరిగిన ధరలు
చికెన్, గుడ్లూ ప్రియం
న్యూఢిల్లీ: చికెన్, గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. కోళ్ల దాణా ధరలు నెల రోజుల్లోనే 25 శాతం ఎగబాకి క్వింటాల్‌కు రూ.5,200కు చేరాయి. దీంతో పౌల్ట్రీ రంగంపై వ్యయ భారం పెరుగుతోంది. ఇప్పటికే గుడ్ల ధరలు ఏడాది వ్యవధిలో 8 శాతం పెరిగి డజను రూ.84.93కు చేరాయి. చికెన్ ధరల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 8.41 శాతంగా నమోదైంది. దాణా ఖర్చులు ఇలాగే పెరుగుతూ పోతే శీతాకాలంలో గుడ్లు, చికెన్‌కు డిమాండ్ అధికమైతే వినియోగదారులు మరింత ధరల సెగను ఎదుర్కోవాల్సి రావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పౌల్ట్రీ ఉత్పత్తి వ్యయంలో 65 – 70 శాతం వరకు దాణాకే ఖర్చవుతుంది. ఇందులో కీలకమైన సోయాబీన్ మీల్, మొక్కజొన్న ధరలు పెరగడం కోళ్ల పెంపకందారులపై ఒత్తిడిని పెంచుతోంది. ఢిల్లీ ప్రాంతంలో లైవ్ బ్రాయిలర్ కోళ్ల ఫామ్‌గేట్ ధర కిలోకు రూ.95–105 మధ్య ఉందని పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి రికీ థాపర్ పేర్కొన్నారు. మరోవైపు ఉత్పత్తి వ్యయం సుమారు రూ.110గా ఉండటంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు. రిటైల్ మార్కెట్లో చికెన్ ధరలు కిలోకు రూ.280–రూ.320 మధ్య కొనసాగుతున్నాయి. శుక్రవారం తెలుగు రాష్ర్టాల్లో ఒక్క కోడి గుడ్డు ధర రూ.6.50పైగా.. డజన్ ధర రూ.78గా పలికింది. మరోవైపు కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.270గా ఉంది.
ముడి పదార్థాల ధరలే దాణా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. సోయాబీన్ ధర క్వింటాల్‌కు సుమారు రూ.7,000గా పలుకుతోంది. 2026–27 సీజన్‌కు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.5,708గా ఉంది. ఇథనాల్ తయారీ సంస్థల నుంచి పెరుగుతున్న డిమాండ్‌తో మొక్కజొన్న ధర క్వింటాల్‌కు రూ.3,000కు చేరింది. దీనికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.2,410గా ఉంది. ఖరీఫ్ సీజన్‌లో పంట దిగుబడులు తగ్గే అవకాశాలు కూడా సరఫరాపై ఆందోళనలను పెంచుతున్నాయి. దీంతో భవిష్యత్తులో దాణా ధరలు మరింత పెరగొచ్చని పౌల్ర్టీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







కామెంట్‌లు (0)