సొంత భూమిదారులకే సాయం
మూడేళ్లల్లో వాస్తవ సాగుదారులకు నయాపైసా జమ లేదు
అర్నబ్ తుపాన్ దాడితో మరింత ఆర్థిక పతనం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు ఈ సారి కూడా ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ సాయం అందించకుండా మొండి చెయ్యి చూపింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎల్‌నినో ప్రభావిత తీవ్ర కరువు, వాయుగుండం, అర్నబ్ తుపాన్.. వరుసగా మూడు ప్రకృతి విపత్తులకు పంటలు దెబ్బతిని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరీ ముఖ్యంగా పంట చేతికొచ్చే వేళ అర్నబ్ తుపాన్ దాడి చేసిన జిల్లాలన్నీ కౌలు సేద్యం అత్యధికంగా సాగే ప్రాంతాలు. ఇక్కడ వరి సాగే ఎక్కువ. అర్నబ్ తుపాన్ దూసిన జల ఖడ్గానికి నష్టం వాటిల్లిన పంటల్లో వరి 90 శాతానికిపైగా ఉందని ప్రభుత్వమే పేర్కొంది. అధిక కౌళ్లు, పెరిగిన వ్యవసాయ పెట్టుబడులకు తుపాన్ నష్టం తోడై కౌలు రైతులకే అపార ఆర్థిక నష్టం కలిగింది. ఈ విపత్కర పరిస్థితుల్లో తమను గుర్తించి అన్నదాతా సుఖీభవ సాయం ఈ తడవైనా ప్రభుత్వం అందించి ఆదుకుంటుందని ఆశగా ఎదురు చూసిన కౌలు రైతులకు ప్రభుత్వం సాయం అందించకుండా ఎగనామం పెట్టింది. శుక్రవారంనాడు (అక్టోబర్ 30) కేవలం స్వంత భూమి కలిగిన రైతులకే కూటమి సర్కార్ ఈ ఏడాది రెండవ కిస్తు రూ.5 వేలు విడుదల చేయగా, కేంద్రం నుంచి పిఎం కిసాన్ రెండవ విడత కిస్తు రూ.2 వేలు జమ అవుతోంది.
సాకులతో సరి
సాగుదారులకు ప్రతి ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ టిడిపి కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీ ‘అన్నదాతా సుఖీభవ’. మొత్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టుకోకుండా పిఎంకిసాన్/అన్నదాతా సుఖీభవగా పేరు పెట్టింది. కేంద్రం ఏడాదిలో మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున మొత్తం ఆరు వేలు జమ చేస్తే, రాష్ట్రం రెండు విడతల్లో ఐదైదు వేలు, మూడవ విడత 4 వేలు ఇస్తోంది. కేంద్రం కౌలు రైతులకు నాయాపైసా సాయం చేయనందున తానే మొత్తం రూ.20 వేలు ఏడాదిలో మూడు దశల్లో ల్యాండ్ ఓనర్లతో పాటే వారికీ సొమ్ము జమ చేస్తానంది. కేంద్రం పిఎం కిసాన్ కిస్తు ఎప్పుడు విడుదల చేస్తే ఆ రోజునే రాష్ట్రం వాటా అన్నదాతా... కిస్తును కలిపి ఇవ్వాలన్నది కూటమి ప్రభుత్వ నిర్ణయం. 2024లో కూటమి అధికారంలోకి రాగా ఆ ఏడాది (2024-25) పథకం అమలు చేయకుండా ఎగ్గొట్టింది. రెండో ఏడాది (2025-26) నుంచి కేవలం సొంత భూమి ఉన్న రైతులకే ఇస్తోంది. ఆ విధంగా మూడో ఏడాది (2026-27) మొదటి కిస్తు ల్యాండ్ ఓనర్లకు పరిమితం చేసి కౌలు రైతులను మినహాయించింది. అర్నబ్ తుపాన్ వెలిసిన వెంటనే అక్టోబర్ 30న ఈ ఏడాది రెండవ కిస్తును ల్యాండ్ ఓనర్లకు జమ చేసిన ప్రభుత్వం కౌలు రైతులకు ఇవ్వకుండా అన్యాయం చేసింది. సుమారు 46.85 లక్షల మందికి అన్నదాతా.. సాయం రూ.5 వేలు జమ అవుతుండగా, కేంద్రం విధించిన షరతుల వలన పిఎం కిసాన్ కిస్తు 2 వేలు మాత్రం 39 లక్షల మందికే పడుతుంది.
ఉద్దేశ పూర్వక అన్యాయం
రాష్ట్రంలో లక్షల సంఖ్యలో రైతులున్నారని చెబుతూ వస్తున్న ప్రభుత్వం, ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరికి రూపాయి కూడా సాయం అందించలేదు. ఖరీఫ్ సీజన్‌లో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతుందని, కొంచెం సమయం చూసుకొని వారికి సాయం విడుదల చేస్తామన్నారు. 2025-26లో ఆ సాకుతో సాయం చేయకుండా దాట వేశారు. తిరిగి 2026లో తొలి కిస్తు సమయంలోనూ ఇలాంటివే చెప్పారు. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ అడ్డంకి వస్తోందని తప్పించుకుంటున్నట్లు సమాచారం. కొనసాగుతున్న పథకాలకు ఎన్నికల కోడ్ ఉండదు. సాధారణ అనుమతులతో అమలు చేయవచ్చు. కౌలు రైతులకు సహాయం ప్రభుత్వానికి ఇష్టం లేదని అర్థమవుతోంది. వైసిపి తెచ్చిన కౌలు చట్టం స్థానంలో సులభతరంగా కొత్త చట్టం తెస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ హామీని అటకెక్కించింది. ఉనికిలో ఉన్న సిసిఆర్‌సితోనైనా గుర్తింపు కార్డులిచ్చి కౌలు రైతులకు సాయం చేయకుండా మొత్తానికే వారి ఉసురు పోసుకుంటోంది.







కామెంట్‌లు (0)