శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకట్టుబట్టలతోనే నిరాశ్రయులు

-60 నిమిషాల క్రితం

kattubattalatone nirasrayulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 03:19 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పరాయి పంచన తలదాచుకుంటున్న తుపాను బాధితులు

  • అందని ప్రభుత్వ సాయం

​ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి : ​‘కట్టుబట్టలతో మిగిలాం. ఎక్కడ తలదాచుకోవాలో తెలీదు. తుపాను వచ్చి మూడు రోజులు గడుస్తున్నా కనీసం పలకరించే వారు కూడా లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందలేదు’... అంటూ వాపోతున్నాయి అర్నబ్‌ తుపాను బాధిత మత్స్యకార కుటుంబాలు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం, కొత్తపట్నం, రంగంపేట, సుబ్బంపేట తదితర తీర ప్రాంత గ్రామాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. సముద్రపు అలల ఉధృతికి సుమారు 35 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. మరికొన్ని సముద్రంలో కలిసిపోయాయి. ఇళ్లతో పాటు ఇంట్లోని సామగ్రి, దుస్తులు, నిత్యావసర వస్తువులు సైతం అలల పాలయ్యాయి. దీంతో, బాధిత కుటుం బాలు నిరాశ్రయులుగా మిగిలాయి. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నాయి.

​పగలు ఇంటి వద్ద.. రాత్రి పాఠశాలల్లో...

ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు శాశ్వత నివాసం సంగతి అటుంచితే, తాత్కాలికంగా తలదాచుకునేందుకు కూడా సరైన వసతి లేకుండా పోయింది. పగలంతా కూలిపోయిన ఇళ్ల వద్దే ఉంటూ, రాత్రి వేళ పాఠశాలలు, దేవాలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి, ఉండటానికి నీడ లేక అల్లాడుతున్నారు. కనీసం నిత్యావసర సరుకులైనా అందిస్తే ఆకలినైనా తీర్చుకుంటామని బాధిత మహిళలు వేడుకుంటున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వద్దకు వస్తున్నారని... కానీ, ఇళ్లు కోల్పోయి రోడ్డున పడిన తమ సమస్యలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రకటనలు తప్ప తమకు ఎలాంటి భరోసా లభించడం లేదని వాపోతున్నారు. తమకు న్యాయం జరిగేంతవరకు ఓట్లు వేసే ప్రసక్తే లేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మా గోడు వినే నాథులే లేరు.. : - ​మైలిపిల్లి లక్ష్మి, మాయాపట్నం, ఉప్పాడ శివారు

తుపాను సమయంలో అందరం భయంతో పునరా వాస కేంద్రానికి వెళ్లి తలదా చుకున్నాం. ఈలోపు మా ఇల్లు సముద్రంలో కలిసిపో యింది. తిరిగొచ్చి చూస్తే ఇల్లూ లేదు, సామాన్లూ లేవు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మా పరిస్థితిని పట్టించుకునే వారే లేరు.


​అధికారులు ఎవరూ మా దగ్గరకు రాలేదు : ​మైలిపిల్లి కొండమ్మ, బాధిత మహిళ

​తుపాను కారణంగా ఇల్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిన మా వద్దకు అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవు. కూలిపోయిన ఇంటి వద్దే మూడు రోజులుగా ఉంటున్నాం. కనీసం ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు కూడా అందలేదు.


ప్రభుత్వం నుంచి సాయం కరువు : ​- వనపిల్లి కొయ్యమ్మ, బాధితురాలు, మాయాపట్నం

​తుపాను బాధితులను తక్షణమే ఆదుకుంటామని టిడిపి కూటమి ప్రభుత్వ పాలకులు చెబుతున్నప్పటికీ మాకు ఇప్పటివరకు ఎలాంటి సహాయమూ అందలేదు. కొన్నిచోట్ల బియ్యం పంపిణీ చేశామని చెబుతున్నా మా వరకూ చేరలేదు. ఇల్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్