'పల్మనరీ ఎంబాలిజం' సమస్య ఉన్నట్లు వైద్యుల నిర్ధారణ
కర్నూలుకు తరలింపు
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ర్టికల్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రి నుంచి కర్నూలు ప్రభుత్వాసుత్రికి తరలించారు. హేమంత్‌కు అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు ఆసుపత్రికి పంపారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పోలీస్ బందోబస్తు మధ్య హేమంత్‌ను కర్నూలుకు వైద్యుల పర్యవేక్షణలో తరలించారు. పోలీసుల కాల్పుల అనంతరం గత 13 రోజులుగా అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిందితుడికి చికిత్స పొందుతున్నాడు. బుల్లెట్ గాయాలకు రక్తప్రసరణ నిలిచిపోయి కుళ్ళిపోవడంతో పది రోజుల క్రితం అతని కుడికాలును వైద్యులు తొలగించారు. రెండు రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి అతను మంచంపై నుంచి కిందపడ్డాడు. ఈ సమయంలో వైద్యులు నిందితుడికి సిటీ స్కాన్ చేయదంతో అతనికి పల్మనరి ఎంబాలిజం ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్సల అనంతరం(పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్) తలెత్తే తీవ్రమైన సమస్యల్లో పల్మనరీ ఎంబాలిజం ఒకటని వైద్య నిపుణులు తెలిపారు. శరీరంలో ప్రవహించే రక్తం చిన్నచిన్న గడ్డలుగా మారడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలిసింది. నిందితుడు హేమంత్‌కు ఊపిరితిత్తుల్లో పల్మనరీ ఎంబాలిజం(రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి ఎక్కువ అయినట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు.








కామెంట్‌లు (0)