- మాజీ మంత్రి పేర్ని నాని
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డిఎస్‌సి పరీక్ష రాయకుండానే టీచర్ పోస్టులు ఇవ్వడంతపాటు వారందరినీ ఎసి బస్సుల్లో తీసుకొచ్చి కళ్యాణ మండపాల్లో ఉంచి ప్రభుత్వ కార్యాలయాల ముందు డిజెలు పెట్టి కొట్టించి తిరిగి వైసిపి నాయకులపైనే కేసులు పెట్టారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగదారిన ఉద్యోగాలు పొందిన వారిని ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం తట్టుకోలేక పోతోందని విమర్శించారు. కొట్టడంతోపాటు వైసిపికి చెందిన ఎస్‌సి నాయకులపైనే తిరిగి ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. శాప్ కార్యాలయం వద్ద ధర్నాకు ఎవరు అనుమతినిచ్చారో చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికల ముంగిట వైసిపి క్రియాశీలక కార్యకర్తలను జైళ్లలో వేయడానికే ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందన్నారు. రాజధాని నడిబొడ్డున సాయికృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీస్టేషన్‌లో కొట్టి చంపి, శవాన్ని బూడిద చేసి, మాయం చేసి చివరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు కూడా కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారని అన్నారు.
పోలీసులు తోయడం వల్లే కాకుమాను రాజశేఖర్ మృతి : సుధాకర్‌బాబు
డిఎస్‌సి స్పోర్ట్స్ కోటాలో 382 ఉద్యోగాల్లో భారీగా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, వాటిని శాప్ అధికారులకు అందించి, నకిలీ సర్టిఫికెట్లు ఉన్నవారిని తొలగించి అర్హులకు న్యాయం చేయాలని చెప్పేందుకే ఐదు రోజుల ముందే నోటీసు ఇచ్చి 21న శాప్ కార్యాలయానికి వచ్చామని వైసిపి నాయకులు టిజెఆర్ సుధాకర్‌బాబు తెలిపారు. వికలాంగులపైనా యువగళం కార్యకర్తలు దాడి చేసిన దృశ్యాలు కూడా ఉన్నాయన్నారు. పోలీసుల తోపులాటలో కాకుమాను రాజశేఖర్ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అలాగే వరికూటి అశోక్‌బాబు తదితరులు మాట్లాడారు.








కామెంట్‌లు (0)