- అధికారుల అలసత్వంతో ప్రాణనష్టం జరిగితే కఠిన చర్యలు తప్పవు
- ప్రభుత్వం ఇచ్చిన భద్రత నియమాలు పాటించకపోతే అధికారులు చర్యలు తీసుకోవాలి
- రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి: మత్స్యకారుల ప్రాణరక్షణ, వారి కుటుంబాల భద్రత, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడూ ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మత్స్యకారుల భద్రత, ట్రాన్స్‌పాండర్ల ఏర్పాటు, బోట్ల ఫిట్‌నెస్, బీమా సౌకర్యం తదితర అంశాలపై మంత్రి శుక్రవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫానులు, విపత్కర పరిస్థితుల్లో మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, ఆర్టీజీఎస్ జారీ చేస్తున్న హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తుండటం ఆందోళనకరమన్నారు. సముద్రంపై ఎంత అనుభవం ఉన్నప్పటికీ ప్రకృతి విపత్తులను తేలిగ్గా తీసుకోవద్దని హితవు పలికారు. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా విలువైన ప్రాణాలను బలితీసుకుంటుందని, కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుందని పేర్కొన్నారు. తుఫానుల సమయంలోనే కాకుండా సాధారణ వేటకు వెళ్లేటప్పుడు కూడా ప్రభుత్వం రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) కచ్చితంగా అనుసరించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలపై మత్స్యకారులకు ముందుగా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడం మత్స్యకారుల ప్రాణాలను కాపాడటానికేనని స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)