- దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
- ఎన్నికలు హామీలను తక్షణమే అమలు చేయాలి
- జిల్లాలో తక్షణమే కిడ్నీ ఆసుపత్రి నిర్మించాలి
- గంపలగూడెం వంతెన, చింతలపూడి పథకం పూర్తి చేయాలి
- కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : ఎన్‌టిఆర్ జిల్లా ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ డిమాండ్ చేశారు. ముఖ్యంగా జిల్లా పరిషత్, విజయవాడ నగరపాలక సంస్థ (కార్పొరేషన్) సహా స్థానిక సంస్థల్లో కొలువుదీరిన నూతన నాయకత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పెండింగ్ పనులను పూర్తి చేయించాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా జిల్లాలో ఏళ్లుగా పడుకున్న సమస్యలను గుర్తు చేశారు.జిల్లాలో కిడ్నీ సంబంధిత వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని డి.వి. కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ వ్యాధుల బారిన పడి సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 2 వేల నుండి 3 వేల మంది బాధితులు డయాలసిస్ చేసుకుంటూ తీవ్ర ఆర్థిక, శారీరక ఇబ్బందులతో పోరాడుతున్నారని పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడేందుకు జిల్లాలో తక్షణమే ఒక ప్రత్యేక కిడ్నీ ఆసుపత్రిని నిర్మించాలని, కలుషిత నీటి వల్లే వ్యాధులు ప్రబలుతున్నందున ప్రతి ఇంటికి కొళాయి ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, గత తొమ్మిది సంవత్సరాలుగా గంపలగూడెం వంతెన నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పెండింగ్‌లో ఉందని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన సుమారు లక్ష మంది ప్రజలు నిత్యం రాకపోకలకు, అత్యవసర వైద్య సేవలకు, రైతుల ఉత్పత్తుల రవాణాకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే కీలకమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి వేలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనే ఉన్నప్పటికీ జగ్గయ్యపేట, నందిగామ, ఇబ్రహీంపట్నం, కొండపల్లి పట్టణాలతో పాటు విజయవాడ నగరంలోని పలు శివారు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, శాశ్వత ప్రాతిపదికన మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, గొల్లపూడి, గుంటుపల్లి ప్రాంతాల ప్రజలు విటిపిఎస్ నుండి వెలువడే బూడిద, పొగ కాలుష్యం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ, కీళ్ల సమస్యల బారిన పడుతున్నారని, ఆధునిక సాంకేతికతతో కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలను కాపాడాలని కోరారు. మరోవైపు జగ్గయ్యపేట ప్రాంతంలోని సిమెంట్, కెమికల్ పరిశ్రమలు కనీస కాలుష్య నిబంధనలను పాటించకపోవడం వల్ల జల, భూ, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమై పంటలు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా సొంత ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేయడంతో పాటు, గతంలో నిర్మించిన టిడ్కో, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను, కేటాయింపుల్లోని అవకతవకలను తక్షణమే పరిష్కరించి లబ్ధిదారులకు అప్పగించాలని డి.వి. కృష్ణ కోరారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం, రాజకీయ వివక్ష లేకుండా నూతన పెన్షన్లను మంజూరు చేయాలన్నారు. విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా అవసరమైన చోట నూతన వంతెనలను నిర్మించడంతో పాటు, చిన్నపాటి వర్షానికే నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరించి పునర్నిర్మించాలని ప్రభుత్వం, స్థానిక సంస్థల నూతన నాయకత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)